అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కేతిరెడ్డి ప్యాలెస్ పై సెల్ఫీ చాలెంజ్ విసిరారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్రమాలపై లోకేష్ అధికారంలోకి రాగానే తీవ్ర చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ధర్మవరం చెరువును ఆక్రమించి, ఫామ్ హౌస్ నిర్మించారంటూ నారా లోకేష్ పాదయాత్రలో మండిపడ్డారు. ఇక ఇప్పుడు, వారం రోజుల్లో చెరువును ఆక్రమించి నిర్మించిన ప్యాలెస్ ను ఖాళీ చేయాలని, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మరదలు గాలి వసుమతికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూమితో పాటు చెరువును కూడా కబ్జా చేసినట్లు అధికారులు నిర్ధారించారు. మొత్తం 30 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని వారు వెల్లడించారు.
ధర్మవరం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 904, 905, 908, 908 లలో ఉన్న భూములను అప్పటి రెవెన్యూ అధికారులు రికార్డుల్లో గాలి వసుమతి పేరుతో 25 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నమోదు చేశారు. అయితే, అదే ప్రాంతంలో ఉన్న 908, 909, 910, 616-1 సర్వే నంబర్ల పరిధిలో దాదాపు 20 ఎకరాలు భూమిని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు.
అందులో మొత్తం 45 ఎకరాల్లో విలాసవంతమైన ఫామ్ హౌస్, రేస్ ట్రాక్, గుర్రాల కోసం షెడ్లు, చెరువులో బోటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అన్ని పనులు చేసినట్లు సాక్ష్యాలు ఉన్నాయి. ఈ భూముల కొనుగోలును, ఆక్రమణను, కేటాయింపును కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తన తమ్ముడు కృష్ణారెడ్డి భార్య గాలి వసుమతికి రిజిస్ట్రేషన్ చేయించి పెట్టారు.
అంతేకాకుండా, ధర్మవరం మండల పరిధిలోని మల్లా కాల్వ గ్రామంలో కూడా 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. ఆ భూమిపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన అక్రమాలపై అధికారులు కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు.