వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేశ్(Nandigam Suresh)పై తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయునిపాలెం గ్రామంలో టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి కృష్ణపై దాడి చేసిన కేసులో పోలీసులు మే 18న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సురేశ్ తన సోదరుడు నందిగం వెంకట్‌తో కలిసి బాధితుడిని దాడి చేసి, ఇంటికి తీసుకెళ్లి బంధించినట్టు ఆరోపణలు వచ్చాయి. అక్కడ సురేశ్ భార్య బేబి ఇతరులతో కలిసి రాళ్లు, కర్రలతో దాడి చేసినట్టు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో నందిగం సురేశ్ పలుమార్లు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినప్పటికీ, న్యాయస్థానం ఆయనను జైల్లోనే ఉంచుతూ బెయిల్ తిరస్కరించింది. అయితే తాజాగా మరోసారి వేసిన బెయిల్ పిటిషన్‌పై గుంటూరు జిల్లా కోర్టు నిన్న (జూన్ 30) ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుతో ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ వర్గం ఉపశమనం పొందినట్లు అయ్యింది.
నందిగం సురేశ్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు కొన్ని ముఖ్యమైన షరతులను విధించింది. వాటిలో కేసు దర్యాప్తు పూర్తయ్యేంతవరకు పోలీసులకు అందుబాటులో ఉండాలి, సాక్షులను బెదిరించరాదు, నేరాలకు పాల్పడకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. అలాగే, వచ్చే మూడు నెలలపాటు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.