Ambati Rambabu మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట లభించింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో, ఆయన్ను కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.
గత ఏడాది నవంబర్ 12న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న సీఐని అడ్డుకున్నారని అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీ కావడంతో, పట్టాభిపురం పోలీసులు మూడు రోజుల క్రితం ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.
ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన గుంటూరు కోర్టు, తాజాగా అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన, కోర్టు ఉత్తర్వులతో రేపు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
