Balineni & Sucharitha : అంత సీన్ లేదు.!

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ హోం మంత్రి సుచ‌రిత వ్య‌వ‌హారం టీ క‌ప్పులో తుఫాన్ మాదిరిగా స‌మ‌సిపోనుంది.

  • Written By:
  • Publish Date - April 11, 2022 / 02:15 PM IST

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ హోం మంత్రి సుచ‌రిత వ్య‌వ‌హారం టీ క‌ప్పులో తుఫాన్ మాదిరిగా స‌మ‌సిపోనుంది. సీనియ‌ర్ మంత్రిగా పేరున్న‌ప్ప‌టికీ బాలినేని ఒంగోలు నియోజ‌వ‌ర్గం వ‌ర‌కే ఆయ‌న రాజ‌కీయ ప‌రిమితం. ఇక సుచ‌రిత హోం మంత్రిగా చేసిన‌ప్ప‌టికి ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆమె ప్రాబ‌ల్యం పూర్తిగా ఉండ‌దు. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఇచ్చిన స‌ర్వే సారాంశంలోని అంశమ‌ట‌. అందుకే, వాళ్లిద్ద‌ర్నీ మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించార‌ని టాక్‌.మంత్రివ‌ర్గం నుంచి బాలినేని శ్రీనివాస‌రెడ్డిని త‌ప్పించ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణాలు లేక‌పోలేదు. ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో ఆయ‌న ముద్ర కొంత ఉంది. కేవ‌లం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కుటుంబానికి బంధువు కార‌ణంగా ఆ గుర్తింపు ల‌భించింది. స్వ‌ర్గీయ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కుటుంబం మ‌ధ్య బ‌ల‌మైన బంధుత్వం ఉంది. వైవీ సుబ్బారెడ్డి కుటుంబానికి మాజీ మంత్రి బాలినేనికి బంధుత్వం ఉన్న కార‌ణంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బాలినేని స‌న్నిహితం అయ్యారు. పైగా దూరం బంధువు కూడా కావ‌డంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల‌పై పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చారు. దాన్ని దుర్వినియోగం చేశార‌ని టాక్‌.

ప్ర‌కాశం జిల్లాలోని ప‌లు నియోజ‌కవ‌ర్గాల వైసీపీ లీడ‌ర్ల నుంచి బాలినేనిపై వైసీపీ అధిష్టానంకు ఫిర్యాదులు వెల్లువెత్తిన‌ట్టు తెలిసింది. పైగా పీకే ఇచ్చిన స‌ర్వేలోనూ బాలినేని అక్ర‌మాలు, అవినీతి, రాజ‌కీయ వైఫ‌ల్యం గురించి దారుణ‌మైన ఫ‌లితం వ‌చ్చింద‌ని ప్ర‌త్య‌ర్థుల్లోని టాక్‌. అందుకే, ఆయ‌నకు మంత్రివ‌ర్గంలో తిరిగి స్థానం ఇవ్వ‌కుండా జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నాడని తాడేప‌ల్లి వ‌ర్గాల స‌మాచారం. అంతేకాకుండా, గ‌త మూడేళ్లుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను కూడా ప్ర‌కాశం జిల్లా విష‌యంలో ఆయ‌న నిరాక‌రించారు. ఆ జిల్లాకు చెందిన సీనియ‌ర్ల‌కు కార్పొరేష‌న్‌, నామినేడెట్ ప‌ద‌వుల విష‌యంలోనూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ప‌లు మార్లు వ్య‌వ‌హ‌రించార‌ని తెలుస్తోంది.మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన తొలి రోజుల్లోనే బాలినేని హ‌వాలా వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింద‌ని ప్ర‌త్య‌ర్థులు గుర్తు చేస్తున్నారు. ఆయ‌న‌ కారు స్టిక్క‌ర్ తో త‌మిళ‌నాడుకు న‌గ‌దును త‌ర‌లిస్తూ దొరికిపోయిన సంద‌ర్భంగా ఆయ‌న అక్ర‌మాల వ్య‌వ‌హారం వెలుగుచూసింది. పైగా విద్యుత్ శాఖ నిర్వ‌హ‌ణ‌లో ఆయ‌న ఘోరంగా విఫ‌లం అయ్యారు. ముందుచూపు లేక‌పోవ‌డంతో ఏపీలోని ప‌రిశ్ర‌మ‌ల‌కు విద్యుత్ కోత, చార్జిల‌ను ఐదుసార్లు పెంచాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దానికి బాలినేని చేత‌గానిత‌నంగా కార‌ణ‌మ‌ని తాడేప‌ల్లి ప్యాలెస్ వ‌ర్గాలు భావిస్తున్నాయ‌ట‌. ఏపీలోని ప్ర‌జ‌లు విద్యుత్ కోత‌ల‌పై ఆగ్ర‌హంగా ఉన్నారు. ఆ కోణం నుంచి ఆలోచించిన జ‌గ‌న్ ఆయ‌న్ను దూరంగా పెట్టార‌ని టాక్.
ఒంగోలు నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009,2012 పాటు ఐదు పర్యాయాలు గెలిచారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం త‌రువాత మంత్రిగా ఉన్న ఆయ‌న జ‌గ‌న్ వెంట న‌డిచారు. ఆ సంద‌ర్భంగా 2012లో జరిగిన ఉప ఎన్నికలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్థనరావుపై గెలుపొందారు. 2014ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలలో తిరిగి ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. 2009లో వై.యస్.రాజశేఖర రెడ్డి రెండవ కేబినెట్ లో గనులు, భూగర్భ, చేనేత వస్త్రాలు, వస్త్రాలు, స్పిన్నింగ్ మిల్లులు, చిన్న తరహా పరిశ్రమల శాఖా మంత్రిగా చేశారు. జ‌గ‌న్ క్యాబినెట్ లో 2019లో విద్యుత్‌ శక్తి వనరులు, అడవులు పర్యావరణం, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఇటీవ‌ల వ‌ర‌కు నిర్వ‌హించారు.

మూడున్న‌ర ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న‌ప్ప‌టికీ బాలినేనికి ప్ర‌కాశం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఫాలోయింగ్ లేద‌ని పీకే ఇచ్చిన స‌ర్వే సారంశం. పైగా ఇటీవ‌ల ఆయ‌న కుమారుడు జోక్యం రాజ‌కీయాల్లో పెర‌గ‌డంతో అక్ర‌మాలకు అంతులేకుండా పోయింద‌ని అధిష్టానం వ‌ద్ద ఉన్న రిపోర్ట‌ని చెప్పుకుంటున్నారు. ఇక హోంశాఖ మంత్రిగా సుచ‌రిత‌కు మొద‌టి క్యాబినెట్ లో జ‌గ‌న్ అవ‌కాశం క‌ల్పించారు. తొలిసారి ఎమ్యెల్యే అయిన‌ప్ప‌టికీ కీల‌క‌మైన పోస్ట్ ను ఇచ్చారు. ఇప్పుడు ఆమెను తొల‌గించ‌డంతో రాజీనామా చేయ‌డం వైసీపీకి అంత‌బ‌ట్ట‌కుండా ఉంది. వీళ్లిద్ద‌రూ అనుచరుల‌తో స‌మావేశం అయ్యారు. వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఎక్క‌డ‌కు వెళ్లాలి? అనే ప్ర‌శ్న వేసుకుంటే ప్ర‌త్యామ్నాయం కంటిచూపు మేర క‌నిపించ‌డంలేదు. తెలుగుదేశం, జ‌నసేన‌లోకి బాలినేని వెళ్ల‌లేరు. ఇప్ప‌టికే ఆయ‌న అవినీతి సుమారు 13 వంద‌ల కోట్ల‌కు పైగా ఉంద‌ని టీడీపీ ప‌త్రాల‌ను విడుద‌ల చేసింది. ఇక జ‌న‌సేన పార్టీ ఆయ‌న్ను ఆద‌రించ‌డానికి సిద్ధంగా లేద‌ని ఆ పార్టీ చెబుతోంది. తొలిసారి ఎమ్మెల్యే అయిన సుచ‌రిత‌కు సొంత ఓటు బ్యాంకు త‌క్కువ‌. జ‌గ‌న్ హ‌వాలో మాత్ర‌మే ఆమె గెలుపొందారు. ఆ విష‌యం టీడీపీకి తెలుసు. పైగా ఆమె హోం మంత్రిగా ఉన్న‌ప్పుడు ప‌లు దాడులు టీడీపీపైన జ‌రిగాయి. అలాగే, మాజీ మంత్రుల అరెస్ట్ లు కూడా జ‌రిగాయి. ఆ సంద‌ర్భంగా ఆమె ప‌నితీరును టీడీపీ ప‌లు సంద‌ర్భాల్లో నిల‌దీసింది. ఆ కోణం నుంచి చూస్తే ఆమెను టీడీపీ ఆద‌రించే పరిస్థితి లేదు. ఇప్ప‌టికే ప్ర‌త్తిపాడులో టీడీపీకి బ‌ల‌మైన అభ్య‌ర్థి ఉన్నారు. ఫ‌లితంగా సుచ‌రిత‌కు వైసీపీ మిన‌హా మ‌రో మార్గంలేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో బాలినేని, సుచ‌రిత అల‌క‌పాన్పు ఎక్కిన‌ప్ప‌టికీ పెద్ద‌గా సీరియ‌స్ గా వైసీపీ తీసుకోలేదు. క్యాజువ‌ల్ గా స‌జ్జ‌ల బుజ్జ‌గించ‌డానికి బాలినేని వ‌ద్ద‌కు వెళ్లారు. ఆ సంద‌ర్బంగా ఆయ‌న వాడిన భాష జ‌గ‌న్ కు మండేలా చేసింద‌ని వినికిడి. ఇక సుచ‌రిత‌కు న‌చ్చ చెప్ప‌డానికి ఎంపీ మోప‌దేవి వెంక‌ట‌ర‌మ‌ణ వెళ్లిన‌ప్ప‌టికీ ఆమె రాజీనామా చేయ‌డాన్ని జ‌గ‌న్ సీరియ‌స్ గా తీసుకున్నార‌ట‌. ఏదో ఒక క్యాబినెట్ హోదా ఉండే నామినేటెడ్ ప‌ద‌వి కోసం వాళ్లిద్ద‌రూ జ‌గ‌న్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ప్ర‌త్య‌ర్థుల అభిప్రాయం. కానీ, వాళ్ల‌కు ఎలాంటి ప‌ద‌వులు ఇవ్వ‌డానికి జ‌గ‌న్ సిద్ధంగా లేడ‌ని తెలుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో బాలినేని, సుచ‌రిత వ్య‌వ‌హారం టీ క‌ప్పులో తుఫాన్ మాదిరిగా స‌మసిపోనుందని వైసీపీ వేస్తోన్న అంచ‌నా చాలా వ‌ర‌కు నిజ‌మేన‌ని అనిపిస్తోంది.