Site icon HashtagU Telugu

YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

YS Jagan

YS Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని తీసుకున్న నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నిర్ణయం ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కమీషన్ల కోసం అప్పగించడమేనని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అవినీతికి పరాకాష్ట అని, రాష్ట్రానికి శాశ్వతంగా అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని, ప్రజల కోసం కాకుండా దోపిడీ కోసం మాత్రమే మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారని జగన్ పేర్కొన్నారు.

2019కి ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న మూడు దఫాల్లో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా నిర్మించలేదని జగన్ ఎత్తి చూపారు. తమ ఐదేళ్ల పాలనలో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయగా, వాటిలో ఐదు కళాశాలల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. ఎన్నికల తర్వాత మరో కళాశాలలో అడ్మిషన్లు జరిగాయని చెప్పారు. మిగిలిన వాటిని ప్రస్తుత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి ఉంటే ఈ ఏడాది మరో 7 కళాశాలలు ప్రారంభమై ఉండేవి కదా అని ప్రశ్నించారు. ఈ కళాశాలలు ఏర్పాటు చేసిన తర్వాత వాటి భూముల విలువ పెరగడం వల్లే వాటిని కొట్టేయడానికి ఈ ప్రైవేటీకరణ ప్లాన్ వేశారని ఆయన ఆరోపించారు.

Also Read: Ross Taylor: స్టార్ క్రికెట‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. రిటైర్మెంట్ వెన‌క్కి! 

ఆరోగ్యశ్రీపై నిధుల ఎగవేత ఆరోపణలు

వైద్య విద్యలో సీట్ల పెంపుపై మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వల్ల ఎంబీబీఎస్ సీట్లు 2,360 నుంచి 4,910కి పెరిగాయని, దాదాపు 800 కొత్త సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. వైద్య విద్యలో ఇది అద్భుతమైన కార్యక్రమం అని అభివర్ణించారు. పేద విద్యార్థులకు ఉచితంగా, తక్కువ ఫీజుతో వైద్య విద్య లభించే అవకాశాన్ని ఈ ప్రైవేటీకరణ దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల కళాశాలకు ఎన్ఎంసి వైద్య సీట్లు ఇస్తే చంద్రబాబు వద్దని లేఖ రాసినప్పుడే ఆయన కుట్ర బయటపడిందని జగన్ అన్నారు.

ఆరోగ్యశ్రీని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని జగన్ ఆరోపించారు. 15 నెలల కాలంలో నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ. 4,500 కోట్లలో కేవలం రూ. 600 కోట్లు మాత్రమే ఇచ్చి, దాదాపు రూ. 4,000 కోట్లు ఎగ్గొట్టి పేదవారి ఆరోగ్య భద్రతను భ్రష్టు పట్టించారని విమర్శించారు. రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీని, విశ్రాంతి సమయంలో నెలకు రూ. 5 వేలు ఇచ్చే ఆరోగ్య ఆసరాను కూడా నాశనం చేశారని అన్నారు.

ప్రైవేటీకరణపై సందేహాలు

ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపించారు. కోవిడ్ వంటి విపత్తు సమయాల్లో ప్రభుత్వమే ఉచిత చికిత్సలు అందించిందని, ఇప్పుడు ఆ అవకాశం ఉండదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నిర్ణయాలను రద్దు చేసి, కళాశాలలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ పాపాలకు ప్రజలు ప్రభుత్వాన్ని క్షమించరని హెచ్చరించారు.