AP Tiger : ఏపీలో తిరుగుతున్న పెద్ద పులికి మత్తు ఇంజక్షన్ ఇవ్వాలన్నా ఈ నిబంధనలు తప్పవు!

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పరిసరాల్లో పెద్దపులి ఇంకా తిరుగుతోంది. వచ్చి రెండు వారాలైనా సరే.. ఇక్కడి నుంచి వెళ్లలేదు.

  • Written By:
  • Publish Date - June 6, 2022 / 12:45 PM IST

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పరిసరాల్లో పెద్దపులి ఇంకా తిరుగుతోంది. వచ్చి రెండు వారాలైనా సరే.. ఇక్కడి నుంచి వెళ్లలేదు. సహజంగా ఈ ప్రాంత అడవుల్లో అక్కడక్కడ చిరుతలు మాత్రమే ఉంటాయి. కానీ ఈసారి వచ్చిన పెద్దపులికి ఇక్కడ అన్నీ అనువుగా ఉన్నాయి. నీటి వనరులతోపాటు పశువులు, చల్లని వాతావరణం కూడా అది వెళ్లకపోవడానికి కారణం. ఉదయమంతా విశ్రాంతి తీసుకుని.. అర్థరాత్రి దాటిన తరువాత పశువులను వేటాడుతోంది. ఇప్పటివరకు ఇది మనుషుల రక్తం రుచి చూడకపోవడంతో వారి జోలికి రావడం లేదు. అయినా సరే.. ఈ మండలంలోని పొదురుపాక, ఒమ్మంగి, శరభవరం గ్రామవాసులకు కంటిమీద కునుకు లేదు.

ఒడిశా అడవుల నుంచి వచ్చిన ఈ బెంగాల్ టైగర్.. తొలుత దారి తప్పి వచ్చి ఉంటుందని.. రెండు రోజుల తరువాత వెళ్లిపోతుందని భావించారు. అయినా సరే ఇది వెళ్లడం లేదు. దాదాపు 150 కిలోల బరువుండే ఈ పులి. ఆడపులి జత కోసం అన్వేషిస్తూ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. గురువారం నాడు ఇది బోనులో ఉంచిన ఆవు కళేబరం దగ్గరకు వచ్చింది. అప్పుడే చిక్కాల్సింది. కానీ అక్కడ గొయ్యి తవ్విన ఆనవాళ్లతోపాటు చెట్లు కొట్టేసి ఉండడాన్ని గమనించి ఇది అక్కడి నుంచి తప్పించుకుంది. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ అనుమతితో మరికొన్ని బోనులను ఏర్పాటుచేశారు.

మత్తు ఇంజక్షన్ ఇవ్వడానికి అనుమతులు వచ్చాయి. దీంతో నైట్ విజన్ కెమెరాల ద్వారా దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే.. మత్తు ప్రయోగించిన అరగంట తరువాత ఇది ఆ మత్తుత చెరువులో పడిపోయినా, కొండల పైనుంచి జారిపడినా చనిపోయే ప్రమాదముంది. అందుకే అలాంటి ప్రమాదాలు లేని చోట పులి కనిపిస్తేనే మత్తు ఇంజక్షన్ ఇస్తారు.