Site icon HashtagU Telugu

TTD: భక్తుల భద్రతే లక్ష్యంగా టీటీడీ కీల‌క నిర్ణ‌యం!

TTD

TTD

TTD: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 24 నుండి అక్టోబ‌రు 2వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకునేలా వారి భద్రతే లక్ష్యంగా టీటీడీ (TTD) విజిలెన్స్‌, పోలీస్‌ సిబ్బందితో ప‌టిష్ట‌మైన భ‌ద్రతా ఏర్పాట్లు చేయాల‌ని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తి టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలోని ఈవో కార్యాల‌యంలో గురువారం అధికారుల‌తో ఆయన స‌మీక్షించారు.

ఈ సంద‌ర్బంగా ఈవో మాట్లాడుతూ.. గ‌త‌ బ్రహ్మోత్సవాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సారి బ్రహ్మోత్సవాలలో టీటీడీ విజిలెన్స్‌, పోలీస్‌ సిబ్బంది సమన్వయంతో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయాల‌న్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలు తిలకించడానికి ఏర్పాట్లు చేయాల‌న్నారు. అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద అద‌నంగా మ‌రో 12 స్కాన‌ర్‌ల‌ను త్వ‌రిత గ‌తిన ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

గరుడ సేవకు భక్తులు విశేషంగా తరలివస్తారని, అందుకు తగ్గట్లు భద్రతా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. అధిక సంఖ్యలో రానున్న వాహనాల మూలంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో పార్కింగ్ ప్రాంతాల‌ను పోలీస్‌, విజిలెన్స్ అధికారులు ముంద‌స్తుగా ప‌రిశీలించాల‌న్నారు. భ‌క్తుల‌కు సుల‌భంగా తెలిసేలా తిరుమ‌ల‌, తిరుప‌తి ముఖ్య కూడ‌ళ్లలో వివిధ‌ భాష‌ల‌లో సైన్‌బోర్డులు, సూచిక‌బోర్డులు ఏర్పాటు చేయ‌ల‌ని చెప్పారు. అదేవిధంగా తిరుప‌తి, తిరుమ‌ల‌లో పార్కింగ్ ప్రాంతాల‌ను అభివృద్ధి చేయాల‌న్నారు.

Also Read: Team India: ఆసియా క‌ప్ 2025.. ఈనెల 19న టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌!

ఆగష్టు 18వ తేదీన ఆఫ్ లైన్‌లో వాచీల వేలం

తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు, టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించినవి/ పాక్షికంగా దెబ్బతిన్న 19 లాట్ల వాచీలకు ఆగష్టు 18వ తేదీన ఆఫ్ లైన్ ద్వారా టెండర్ కం వేలం వేయనున్నారు. వాచీలలో టైటాన్, సిటిజెన్, సొనాటా, రాగ, టైమెక్స్ ఇతర స్మార్ట్ వాచెస్ లకు ఆఫ్ లైన్ ద్వారా టెండర్ కం వేలం వేయనున్నారు. ఆసక్తి కల్గిన బిడ్డర్లు వాచీల వేలంలో పాల్గొనవచ్చు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ (వేలంలు) / ఏఈవో ( వేలంలు), టీటీడీ, హరే కృష్ణ మార్గ్, తిరుపతిలో లేదా టీటీడీ వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877- 2264429 ఫోన్ నెంబర్ ద్వారా గాని సంప్రదించగలరు.

ఆగష్టు 15న నిర్వహించే 79వ భారత స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని పరేడ్‌ మైదానంలో వేదికను అందంగా ముస్తాబు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. జాతీయ జెండా వందనం అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచిన వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఐదు గ్రాముల వెండి డాలర్‌, ప్రశంసాపత్రాలను అందజేస్తారు. టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు, ఉద్యోగుల పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.