Chicken Prices : ఆంధ్రప్రదేశ్‌లో చికెన్ రేట్లు రెక్కలు తొడిగాయి. ప్రస్తుతం రీటైల్ మార్కెట్‌లో చికెన్ రేట్లు కేజీకి రూ.270 దాకా పలుకుతున్నాయి. దీంతో చికెన్ అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాక చికెన్ వినియోగం తగ్గుతుంది. అందువల్ల ఆ టైంలో రేట్లు కొంతమేర దిగి వస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. వాస్తవానికి సెప్టెంబరు నెల ప్రారంభంలో కిలో చికెన్ ధర రూ.200 వరకే ఉంది. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లోనైతే కిలో చికెన్‌ను రూ.160కే విక్రయించారు. శ్రావణ మాసం, వినాయక చవితి ఉండటంతో ధర అప్పట్లో లో రేంజులో ఉండిపోయింది. వినాయక చవితి ముగియగానే అమాంతం చికెన్ సేల్స్ పెరిగిపోయాయి. పండగ సీజన్ కూడా సమీపించింది. దీంతో ధరలు క్రమంగా పెరుగుతూపోయాయి. కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే సీన్ మారిపోయింది. చికెన్ రేట్లు పెరిగిపోయి కిలోకు 270 రూపాయలకు(Chicken Prices) చేరాయి.
Also Read :Pull Ups On Signboard : రీల్స్ పిచ్చి.. హైవే సైన్‌బోర్డుపై పుల్ అప్స్.. ఏమైందంటే.. ?
మరోవైపు ఉల్లి, వెల్లుల్లి ధరలు కూడా మండిపోతున్నాయి. కిలో ఉల్లి ధర రూ.70 దాకా పలుకుతోంది. వాస్తవానికి మూడు వారాల కిందటి వరకు కిలో ఉల్లి ధర కేవలం రూ.40 దరిదాపుల్లోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతి సుంకాన్ని ఎత్తేయడంతో ఒక్కసారి ఉల్లి ధర రాకెట్ వేగాన్ని పొందింది. ఈ పరిణామంతో ఉల్లి ధర దాదాపు రెట్టింపై కేజీకి రూ.70 రేంజుకు చేరుకుంది. దీంతో ఉల్లి ధరను కంట్రోల్‌లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. నాఫేడ్ ద్వారా కిలో ఉల్లిని రూ.35కే విక్రయిస్తోంది. రైతు బజార్, మార్కెట్ల వద్ద ఉల్లిని తక్కువ రేటుకు అమ్ముతున్నారు. అయితే ఒక వ్యక్తికి ఒక కిలో మాత్రమే అమ్ముతున్నారు. టమాటా రేట్లు కూడా మండిపోతున్నాయి. కిలో టమాటా ధర రూ.60 దాకా ఉంది. మిగతా కూరగాయలన్నీ కిలోకు రూ.50కిపైనే ఉండటం సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తోంది. క్యాప్సికమ్ కిలోకు రూ. 80, బీన్స్ కిలోకు రూ.80, బీరకాయ కిలోకు రూ.60, గోరు చిక్కుడు కిలోకు రూ.60 వరకు ధర పలుకుతున్నాయి. కోడిగుడ్డు ధర రిటైల్ షాపుల్లో ఒకటి రూ.6 పలుకుతోంది.