Vijayawada: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటోంది. వరద నీటి ప్రవాహం గంట గంటకూ పెరుగుతుండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 15 గేట్లను 7 అడుగుల మేర, మరో 55 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. మొత్తం ఇన్‌ఫ్లో 2,77,784 క్యూసెక్కులు కాగా, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 2,60,875 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా తూర్పు కాలువకు 10,187 క్యూసెక్కులు, పశ్చిమ కాలువకు 6,522 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్‌కు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. త్వరలో బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశముందని వెల్లడించారు.
Read Also: PM Modi : 127 ఏండ్ల తర్వాత భారత్‌కు బుద్ధుని అవశేషాలు
లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు, లంక గ్రామాల్లో నివసించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నదిలో బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లు, పంట్లతో ప్రయాణించరాదని స్పష్టం చేశారు. ఇంకా వరద నీటిలో ఈతకు వెళ్లడం, స్నానం చేయడం, చేపలు పట్టడం వంటివి ప్రమాదకరమని హెచ్చరించారు. వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ బుధవారం ప్రకాశం బ్యారేజీని సందర్శించారు. పరిస్థితిని సమీక్షించిన ఆయన, కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అన్ని విభాగాల అధికారులు, పోలీసు, రెవెన్యూ, జలవనరులు, పంచాయితీ తదితర శాఖల సిబ్బంది — క్షేత్రస్థాయిలో మోహరించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మత్స్యకారులు నదిలో వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విజయవాడ నగరంలో దాదాపు 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అవసరమైతే ఈ ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కృష్ణా నదిలో నీటి మట్టాలు పెరుగుతున్న నేపథ్యంలో, జిల్లా యంత్రాంగం 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. వరద సంబంధిత అత్యవసర సమాచారం కోసం ప్రజలు 91549 70454 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని అధికారుల ప్రకటనలో పేర్కొన్నారు. ఇక, ప్రకాశం బ్యారేజీలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో, భవానీ ఐల్యాండ్‌కు వెళ్లే బోట్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. నదిలో బ్యాక్ వాటర్ తీవ్రంగా పెరగడంతో ప్రయాణానికి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ తరహాలో వరద పరిస్థితి కొనసాగితే, మరింత నీటిని సముద్రంలోకి విడుదల చేయాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజల సహకారంతో అపాయాన్ని నివారించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
Read Also: Rains : ఇక వర్షాలు లేనట్లేనా..? Skymet అంచనాతో ఖంగారుపడుతున్న రైతులు