Site icon HashtagU Telugu

Prakasham Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద హెచ్చరికలు జారీ చేశారు

Prakasham Barrage

Prakasham Barrage

శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇవి నిండు కుండలను గుర్తుకు తెస్తాయి. అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల తదితర ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి 2.94 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అదే స్థాయిలో నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. మరో 14 వేల క్యూసెక్కులను కాల్వలకు వదులుతున్నారు.

ఎగువ సాగర్ నుంచి మంగళవారం ఉదయం వరకు వరద ప్రవాహం కొనసాగినప్పటికీ సాయంత్రం 5 గంటలకే తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు పులిచింతలకు చేరింది. మంగళవారం ఉదయం నాటికి వరద తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజీకి బుధవారం ఉదయం కూడా వరద ఉధృతంగా పెరిగే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగులకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజీ గరిష్ట నీటిమట్టం 57 అడుగులు కాగా దాదాపు పూర్తి సామర్థ్యానికి నీరు చేరింది. శ్రీశైలం జలాశయం రెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 55,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

జూరాల డ్యాం గేట్ల ద్వారా 24,402 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి అనంతరం 43,245 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 78,584 క్యూసెక్కులు, హంద్రీ ద్వారా 117 క్యూసెక్కులు మొత్తం 1,46,348 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత మట్టం 884,400 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 215.4385 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.9946 టీఎంసీలుగా నమోదైంది. విద్యుదుత్పత్తి కారణంగా కుడి విద్యుత్ కేంద్రం నుంచి 31,421 క్యూసెక్కులు, ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.