Site icon HashtagU Telugu

Andhra Pradesh : ఏపీలో ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రధాన నదులు

Floods Imresizer

Floods Imresizer

ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి నదికి మ‌ళ్లీ వ‌ర‌ద పెరిగింది. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టినప్ప‌టికి వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో బుధవారం వ‌ర‌ద క్రమంగా పెరుగుతోంది. రాజమహేంద్రవరం సమీపంలోని దోవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద ఇన్‌స్టంట్ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 14.42 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. పొరుగున ఉన్న తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరికి దాదాపు 15 లక్షల క్యూసెక్కుల వరద నమోదవగా, 54.5 అడుగుల స్థాయిలో మూడో ప్రమాదకర స్థాయిని దాటుతోంది. వరద ప్రభావిత జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ మూడు బృందాలను ఏర్పాటు చేశారు. కాటన్‌ బ్యారేజీ వద్ద రెండో హెచ్చరిక ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. .

వరద తగ్గుముఖం పట్టే వరకు నది తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. శ్రీశైలం జలాశయం నుంచి బుధవారం ఉదయం కృష్ణానదికి 3.95 లక్షల క్యూసెక్కుల వ‌ర‌ద నీరు వచ్చింది. నాగార్జున సాగర్ డ్యాం నుండి దాదాపు అదే పరిమాణంలో వరదనీరు దిగువకు విడుదల అవుతుంద‌ని అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ దిగువన ఉన్న డాక్టర్ కెఎల్ రావు సాగర్ పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 3.75 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3.56 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద మరింత దిగువకు 2.93 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి మరియు వంశధార నదులు కూడా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వ‌ర‌ద ప్ర‌వాహం పెరిగింది. శ్రీకాకుళంలోని గొట్టా బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 54,853 క్యూసెక్కులకు పెరగడంతో మొదటి ప్ర‌మాద హెచ్చరిక జారీ చేశారు.

Exit mobile version