BRS Flexis in AP : ఏపీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీల హ‌ల్ చ‌ల్‌

ఏపీలో కేసీఆర్ పొలిటిక‌ల్ గ్లామ‌ర్ ప్లెక్సీల‌కు వ‌ర‌కు వెళ్లింది. ఆయ‌న పెట్టిన బీఆర్ఎస్ పార్టీ బ్యాన‌ర్లు , హోర్డింగ్ లు గోదావ‌రి జిల్లాల్లో ద‌ర్శ‌నం ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

  • Written By:
  • Updated On - October 7, 2022 / 12:28 PM IST

ఏపీలో కేసీఆర్ పొలిటిక‌ల్ గ్లామ‌ర్ ప్లెక్సీల‌కు వ‌ర‌కు వెళ్లింది. ఆయ‌న పెట్టిన బీఆర్ఎస్ పార్టీ బ్యాన‌ర్లు , హోర్డింగ్ లు గోదావ‌రి జిల్లాల్లో ద‌ర్శ‌నం ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. పార్టీని ప్ర‌క‌టించిన మ‌రుస‌టి రోజు విజ‌య‌వాడ కేంద్రంగా ఫ్లెక్సీల‌ను పెట్టారు. తాజాగా అమ‌లాపురం కేంద్రంగా కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ హోర్డింగ్ లు క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.

ఆంధ్రా మూలాలున్న కేసీఆర్ పూర్వీకులు తెలంగాణాలో స్థిర‌ప‌డ్డారు. ఆయ‌న‌కు ఉత్త‌రాంధ్రాలోని వెల‌మ‌ల‌తో బంధుత్వం కూడా ఉంది. అంతేకాదు, ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించిన హీరోగా ఏపీ, తెలంగాణాల్లో గుర్తింపు ఉంది. గ‌త 20ఏళ్లుగా మంచోచెడో ప్ర‌తి రోజూ కేసీఆర్ ను త‌ల‌చుకుంటూ తెలుగు జ‌నం గ‌డిపారు. అందుకే, ఆయ‌న‌కు క్రేజ్ ఏపీలోనూ ఉంది. ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న ఏపీకి వ‌చ్చిన‌ప్పుడు అక్క‌డి జ‌నం నీరాజ‌నాలు ప‌ట్టారు.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌నకు హాజ‌ర‌య్యారు. ఆ సంద‌ర్భంగా కేసీఆర్ స్పీచ్ కు జ‌నం నుంచి వ‌చ్చిన స్పంద‌న అంద‌రికీ తెలిసిందే. ఇక విజ‌య‌వాడ దుర్గ‌మ్మ‌కు మొక్కులు తీర్చుకోవ‌డానికి స‌తీస‌మేతంగా వెళ్లారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న్ను చూడ‌డానికి జ‌నం ఎగ‌బ‌డ్డారు. రెండోసారి కేసీఆర్ తెలంగాణ‌కు సీఎం కావాల‌ని విజ‌య‌వాడ కేంద్రంగా నాలుక కోసుకున్న అభిమానుల‌ను చూశాం. విశాఖ శార‌దా పీఠంకు వెళ్లిన‌ప్పుడు స్వ‌రూపానందేంద్ర‌స్వామి ద్వారా ఆయ‌న్ను క‌లిసిన భ‌క్తులు ఉన్నారు. తిరుప‌తి వెంక‌న్న కు మొక్కులు తీర్చుకోవ‌డానికి వెళ్లినప్పుడు హైద‌రాబాద్ లోని ఒక మీడియా అధిప‌తి హోర్డింగ్ లు ఏర్పాటు చేసి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే ఏపీలోనూ కేసీఆర్ హ‌వా మొద‌లు కానుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ టికెట్‌పై పోటీ చేయబోయే ఎంపీ పేరును ప్రస్తావిస్తూ కొన్ని బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రేవు అమ్మాజీరావు డబుల్ ఎంఏ అని అమలాపురం క్లాక్ టవర్ వద్ద ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఇలా ఎవ‌రికి వారే ఫ్లెక్సీల‌ను బీఆర్ఎస్ పేరు మీద ఏపీ వ్యాప్తంగా క్ర‌మంగా పెడుతున్నారు. ఇదంతా కేసీఆర్ కు తెలిసి జ‌రుగుతుందా? లేక ఆయ‌న మీద ఉన్న అభిమానంతో జ‌రుగుతుందా? అనేది ఆస‌క్తిక‌ర అంశం.