Site icon HashtagU Telugu

Omricon Case: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు… ఎక్క‌డంటే…?

Omicron

Omicron

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఇప్ప‌టి ఇండియాలో ప‌లు రాష్ట్రాల్లో కేసులు న‌మోద‌వుతుండ‌గా..ఏపీలో కూడా ఒమిక్రాన్ తొలి కేసు న‌మోదైంది. విశాఖ‌లో తొలి కేసు న‌మోదైన‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. ఐర్లాండ్ నుంచి వ‌చ్చిన 34 ఏళ్ల యువ‌కుడికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్థార‌ణ అయింద‌ని హెల్త్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హైమావ‌తి తెలిపారు

ముంబై ఎయిర్ పోర్ట్ లో జ‌రిపిన ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లో నెగిటివ్ గా నిర్థార‌ణ కావ‌డంతో న‌వంబ‌ర్ 27న ఈ యువ‌కుడు విశాఖప‌ట్నం చేరుకున్నాడు. విశాఖలో మరోసారి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు వెంటనే హైదరాబాద్‌ సీసీఎంబీలో జీనోమ్‌ సీక్వెన్సింగ్ కి శాంపిల్స్ పంపి టెస్ట్ చేయ‌గా ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన‌ట్లు తెలిపారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 15 మందికి కోవిడ్‌ పాజిటివ్ గా నిర్థార‌ణ అయింద‌ని… ఈ శ్యాంపిల్స్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా 10 మందిలో ఒకరికి మాత్రమే ఒమిక్రాన్‌గా నిర్ధార‌ణైన‌ట్లు హెల్త్ డైరెక్ట‌ర్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్రజలు ఎలాంటి భయందోళనలకు గురి కావద్దని సూచించారు. ప్రతి ఒక్క‌రు భౌతిక దూరం పాటించి…మాస్క్ లు ధ‌రించాల‌ని హెల్త్ డైరెక్ట‌ర్ హైమావ‌తి తెలిపారు.

మరోవైపు తిరుప‌తిలో ఒమిక్రాన్ కేసు న‌మోదైన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను వైద్య ఆరోగ్య‌శాఖ ఖండించింది. తిరుప‌తిలో ఒమిక్రాన్ కేసు న‌మోదు కాలేద‌ని తెలిపింది. ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని వైద్య ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించింది.