Site icon HashtagU Telugu

TDP – Rajya Sabha : ‘పెద్దల సభ’లో టీడీపీ నిల్.. 41 ఏళ్లలో ఇదే తొలిసారి

Tdp Rajya Sabha

Tdp Rajya Sabha

TDP – Rajya Sabha : 1983 సంవత్సరం నుంచి ఇప్పటివరకు రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం ఉంది. అయితే తొలిసారిగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ప్రాతినిధ్యాన్ని కోల్పోనుంది.  ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక  జరగనుంది. అయితే వీటిలో ఒక్క సీటు కూడా టీడీపీ గెలిచే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి తగిన సంఖ్యలో ఎమ్మెల్యేల బలం లేదు.  ప్రస్తుతం కనకమేడల రవీంద్ర టీడీపీ ఏకైక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. దీంతో రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం సున్నాకు చేరుకోనుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ అంటే గత 41 ఏళ్లలో రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యులు లేకపోవడం ఇదే తొలిసారి అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join

అయినా ఆశలు.. 

2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు రాగా, టీడీపీకి 23 సీట్లే వచ్చాయి. ఒక్క రాజ్యసభ సీటును గెలవాలన్నా.. కనీసం 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. అంతగా ఎమ్మెల్యేల బలం టీడీపీకి లేదు. అందుకే ఇప్పుడు రాజ్యసభ పోల్స్‌లో ఒక్క సీటును కూడా గెల్చుకోలేని స్థితికి టీడీపీ చేరుకుంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ టీడీపీకి కొన్ని ఆశలు పెట్టుకుంది. తాము ప్రతిపాదించే రాజ్యసభ అభ్యర్థికి  వైసీపీ అసంతృప్తులు, వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డవారు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు అండ్ టీమ్ అంచనా వేస్తోంది. సంఖ్యాబలం పరంగా చూస్తే.. ఏపీలో ఖాళీ అయ్యే మూడు రాజ్య­సభ స్థానాలు కూడా వైఎస్సార్‌సీపీకే దక్కుతాయి. ఏప్రిల్‌ 2 నాటికి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి (వైఎస్సార్‌సీపీ), సీఎం రమేష్‌ (బీజేపీ), కనకమేడల రవీంద్రకుమార్‌ (టీడీపీ)ల పదవీకాలం పూర్తికానుంది. ఖాళీ అయ్యే ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుంది. ఈ మూడు స్థానాల్లోనూ గెలుపుతో  రాజ్యసభలో(TDP – Rajya Sabha) వైఎస్సార్‌సీపీ బలం 11కు పెరుగుతుంది. అంటే రాష్ట్ర కోటాలో సీట్లన్నీ వైఎస్సార్‌సీపీ ఖాతాలోకే చేరుతాయి.

Also Read : TSC​​SB : ఫేక్ వెబ్‌సైట్ల లింకులు వస్తున్నాయా ? 8712672222కు వాట్సాప్ చేయండి

సుజన, సీఎం రమేష్, గరికపాటి, టీజీ ఫిరాయింపు

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌లు బీజేపీలోకి ఫిరా­యించారు. ఇక రాష్ట్ర కోటాలో ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో 2020లో నలుగురు (టీడీపీ), 2022లో నలుగురు (ముగ్గురు టీడీపీ, ఒకరు వైఎస్సార్‌సీపీ) పదవీకాలం పూర్తవడంతో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. నాడు అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఎనిమిది రాజ్యసభ స్థానాలు ఆ పార్టీకే దక్కాయి.