Site icon HashtagU Telugu

Plastic Bags Banned: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వినియోగిస్తే రూ.5 వేలు జరిమానా

Carry Bag

Carry Bag

ఒక్కసారి వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ తరహా ప్లాస్టిక్ వినియోగంపై భారీ ఎత్తున జరిమానాలు విధించే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్యాన్ని సృష్టించే వారే వ్యయాన్ని కూడా భరించాలన్న సూత్రం ఆధారంగా సరికొత్త జరిమానాలను విధించింది. ఈ మేరకు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను సవరిస్తూ గురువారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన మార్గదర్శకాలకు సంబంధించి అటబీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగించే వీధి వ్యాపారులపై రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించనున్నారు. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తి, దిగుమతిపై తొలిసారి పట్టుబడితే రూ.50 వేల జరిమానా విధిస్తారు. అదే విధంగా రెండో సారి పట్టుబడిన వారికి ఏకంగా రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిలువ చేసినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. అంతేకాకుండా సీజ్ చేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులపై కేజీకి రూ.10 చొప్పున అదనపు జరిమానా విధిస్తారు. ఆయా సంస్థలు, మాల్స్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగిస్తే రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు జరిమానా విధిస్తారు.

Exit mobile version