Site icon HashtagU Telugu

AP Police : ఏపీలో పోలీసు కానిస్టేబుల్ నియామకాల తుది ఫలితాలు విడుదల

Final results of police constable recruitment in AP released

Final results of police constable recruitment in AP released

AP Police : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ నియామకాల తుది ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ రోజు (ఆగస్టు 1న) మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర హోం మంత్రి తానేటి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఫలితాలను ప్రకటించారు. రాష్ట్ర పోలీసు నియామక బోర్డు (SLPRB) అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్టు వారు వెల్లడించారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పోలీస్ కానిస్టేబుల్ (సివిల్), ఎస్సీటీ కానిస్టేబుల్ (ఏపీఎస్పీ – పురుష) కేడర్లలో నియామకాలు చేపట్టనున్నారు. ఈ నియామక ప్రక్రియ 2022లో ప్రారంభమైంది. ప్రిలిమినరీ పరీక్షను జనవరిలో, తుది (మెయిన్స్) పరీక్షను అదే ఏడాది అక్టోబర్‌లో నిర్వహించారు. కానీ న్యాయ వివాదాల కారణంగా ఫలితాల విడుదల ఈరోజు వరకు ఆలస్యం అయ్యింది.

ఫలితాల్లో టాప్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు:

. గండి నానాజి – 168 మార్కులతో మొదటి ర్యాంకు
. జి. రమ్య మాధురి – 159 మార్కులతో రెండవ స్థానం
. మెరుగు అచ్యుతారావు – 144.5 మార్కులతో మూడవ స్థానం

ఈ ఏడాది జూన్ 1వ తేదీన మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించగా, మొత్తం 37,600 మంది అభ్యర్థులు PETలో అర్హత పొందిన వారు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష అనంతరం అభ్యర్థులకి OMR షీట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు జూలై 12, 2025 వరకు అవకాశం కల్పించారు. ఫలితాల విడుదలపై గత కొన్ని వారాలుగా అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. తొలుత జూలై 30న విడుదల చేయాల్సిన ఫలితాలు, SLPRB పేర్కొన్న న్యాయపరమైన సమస్యల కారణంగా ఆగస్టు 1న ఆలస్యంగా విడుదల అయ్యాయి. ఈ ఆలస్యం కారణంగా పలువురు అభ్యర్థులు ఆందోళనకు లోనయ్యారు. SLPRB ఇప్పటికే అభ్యర్థులకు రెండు వారాల క్రితమే ర్యాంక్ కార్డులు విడుదల చేసింది. ఇప్పుడు తుది ఫలితాల విడుదలతో నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇకపై పోస్టుల భర్తీకి సంబంధించి తదుపరి ప్రక్రియలు  డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు తదితరాలను త్వరలో చేపట్టనున్నారు. ఈ నియామకాల ద్వారా యువతకు నూతన ఉద్యోగావకాశాలు అందించడమే కాకుండా, రాష్ట్ర పోలీస్‌శాఖ శక్తివంతంగా మారేందుకు ఇది దోహదపడనుంది. ఈ కార్యక్రమంలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ ఆర్‌.కె.మీనా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also: Heavy flood : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి.. 8 గేట్లు ఎత్తివేత