Chiranjeevi : టాలీవుడ్ `ఆచార్య` మౌనరాగం!

ఇప్ప‌టి వ‌ర‌కు రెండుసార్లు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యాడు. మూడోసారి క‌లిసేందుకు సిద్ధం అవుతున్నాడు. తెలంగాణ స‌ర్కార్ త‌ర‌హాలో టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచాల‌ని కోరాల‌ని భావిస్తున్నాడు.

  • Written By:
  • Updated On - December 30, 2021 / 05:46 PM IST

ఇప్ప‌టి వ‌ర‌కు రెండుసార్లు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యాడు. మూడోసారి క‌లిసేందుకు సిద్ధం అవుతున్నాడు. తెలంగాణ స‌ర్కార్ త‌ర‌హాలో టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచాల‌ని కోరాల‌ని భావిస్తున్నాడు. ఆ లోపుగా జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌త్యేక క‌మిటీని వేసింది. ఆ క‌మిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను నిర్థారిస్తారు. అలాగే, థియేట‌ర్ల‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను మార్చాల‌ని కూడా టాలీవుడ్ డిమాండ్ చేస్తోంది. ఆ క్ర‌మంలో నిర్మాత్ దిల్ రాజు, న‌ట్టి కుమార్ భిన్నాభిప్రాయాల‌ను వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

టికెట్‌ ధరలను ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక వెలువ‌డే వ‌ర‌కు ఎవ‌రూ ఆ అంశంపై స్పందించవద్దని సినీ పరిశ్రమకు స‌ర్కార్ విజ్ఞ‌ప్తి చేసింది. కోర్టు ఆదేశాలను అనుసరించి, సినిమా టిక్కెట్ల ధరలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం సోమవారం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ-హోమ్ దీనికి ఛైర్మన్‌గా ఉంటారు. రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్‌మెంట్ , ఫైనాన్స్ శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. చలనచిత్ర పరిశ్రమ నుండి వి బాలరథన్ (ఎగ్జిబిటర్), టి సీతారాం ప్రసాద్ (పంపిణీదారు), ఎం రామదాసు (తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్) సభ్యులు. ఈ క‌మిటీ ఇచ్చే నివేదికకు అనుగుణంగా జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకోనుంది.
సినిమా టిక్కెట్ల ధరలు, సినిమా థియేటర్లపై అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలపై చర్చించేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మంగళవారం సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ నానిని కలిశారు. నిబంధనలను ఉల్లంఘించిన థియేటర్లపై ప్రభుత్వం కొరడా ఝులిపిస్తున్న తరుణంలో పలువురిని షట్టర్లను దించాల్సి వస్తోంది.

ఇదిలావుండగా, హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన నిర్మాత దిల్ రాజు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు ఇతర మంత్రుల అపాయింట్‌మెంట్ దొరికినప్పుడు కలవడానికి సినీ వర్గాలు సిద్ధంగా ఉన్నాయని వెల్ల‌డించాడు. తెలంగాణ ప్ర‌భుత్వం పెంచిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం టిక్కెట్ ధరలపై మరో ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆశిస్తున్నామని దిల్ రాజు అన‌డం గ‌మ‌నార్హం.
ఐదవ షోకి అనుమతి వంటి సమస్యలు కూడా ఇవ్వాల‌ని నిర్మాతులు కోరుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామ‌ని రాజు అన్నారు. కానీ, తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా వ‌ర‌కు వాళ్లే నిర్మాతలు, డిస్టిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు, హీరోలు అనే విష‌యాన్ని మాత్రం దాచేస్తున్నాడు. స్వ‌ర్గీయ దాస‌రి నారాయ‌ణ‌రావు ప‌లు సంద‌ర్భాల్లో సినీ మాఫియా మీద ఆవేద‌న చెందాడు. హీరోల నుంచి ఎగ్జిబిట‌ర్ల వ‌ర‌కు మాఫియా ఏర్ప‌డి దోచుకుంటున్నార‌నే విష‌యం దాస‌రి అనేకసార్లు చెప్పిన విష‌యం టాలీవుడ్ కు తెలుసు. ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాల‌తో మాఫీయా హ‌డాలి పోతోంది.

అందరివాడిగా ఉంటాల‌ని భావిస్తోన్న చిరంజీవి తొలుత ఆన్ లైన్ టిక్కెట్ ప‌ద్ధ‌తిని కోరాడు. ఏపీ సీఎం జ‌గ‌న్ ఎదుట ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించాడ‌ని మంత్రి పేర్ని నాని చెబుతున్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ ఏ మొఖం పెట్టుకుని జ‌గ‌న్ వ‌ద్ద ఆన్ లైన్ టిక్కెట్ ప‌ద్ధ‌తి వ‌ద్ద‌ని చెబుతాడ‌ని వైసీపీ వ‌ర్గీయులు ప్ర‌శ్నిస్తున్నారు. మెగాస్టార్ ఇచ్చిన నివేదిక ప్ర‌కారం జ‌గ‌న్ స‌ర్కార్ టిక్కెట్ ధ‌ర‌ల నియంత్ర‌ణ నుంచి ఆన్ లైన్ వ‌ర‌కు చేసింద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకే, చిరు మౌనంగా ఉన్నాడ‌ని ఆయ‌న అభిమానులు భావిస్తున్నారు. రెండు నెల‌లుగా ఏపీ స‌ర్కార్‌, టాలీవుడ్ మ‌ధ్య ర‌గ‌డ జ‌రుగుతుంది. అయిన‌ప్ప‌టికీ సినీ పెద్ద దిక్కుగా ఉండాల‌ని భావిస్తోన్న చిరంజీవి మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. సో..ఆయ‌న మౌనం వీడితేగానీ…ఈ స‌మ‌స్య‌కు ఒక ప‌రిష్కారం వ‌చ్చే అవ‌కాశం లేదన్న‌మాట‌.