Father Kills Daughters మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో ఒక అమానుష ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల చిన్నారిని తండ్రి తన ప్రియురాలితో కలిసి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతోనే హత్య చేసినట్లు చెబుతున్నారు. బాలిక కనిపించకపోవడంతో వెతకగా.. ఇంటి పక్కన ఉండే ఓ మహిళ ఇంట్లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మార్కాపురం జిల్లాలో దారుణం జరిగింది. కన్న కూతుర్ని తండ్రి ప్రియురాలితో కలిసి హత్య చేశాడు. త్రిపురాంతకానికి చెందిన ఎం. శివారెడ్డి, భార్య ఈశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె తులసికి 9 ఏళ్లు. ఈ నెల 25న రాత్రి శివారెడ్డి, ఈశ్వరమ్మ డాబాపై నిద్రించారు. తులసి తన తాతయ్య సుందరయ్య దగ్గర నిద్రించింది. తెల్లవారుజామున తాతయ్య బయటకు వెళ్లారు. ఆయన మళ్లీ వచ్చి చూసేసరికి మంచం మీద తులసి కనిపించలేదు. చిన్నారి కోసం ఇంట్లో వెతికినా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో చుట్టుపక్కల కూడా వెతికారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు కూడా పాప కోసం గాలించారు. ఈ క్రమంలో బాలిక తండ్రి శివారెడ్డికి ఇంటి పక్కన ఉండే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. అప్పుడు మహిళ ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చింది. వెంటనే తాళం పగులగొట్టి చూడగా చిన్నారి విగతజీవిగా పడి ఉంది. తులసి నోట్లో వస్త్రాలు, మొహం, గొంతుపై గాయాలు ఉన్నాయి. ఒంగోలు నుంచి క్లూస్ టీమ్‌ను, గుంటూరు నుంచి ఫోరెన్సిక్ టీమ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. తన భర్త శివారెడ్డి, ఇంటి పక్కన ఉండే బాజీబీ అనే మహిళతో కలిసి తన కుమార్తెను చంపినట్లు బాలిక తల్లి ఈశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివారెడ్డి, బాజీబీలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తులసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతోనే తులసిని తండ్రి శివారెడ్డి ప్రియురాలితో కలిసి చంపినట్లు తెలుస్తోంది.
సత్యవేడులో చిన్నారిని చంపేసిన తల్లి
మరోవైపు తిరుపతి జిల్లా సత్యవేడులో దారుణం జరిగింది. ఆరు నెలల చిన్నారిని తల్లి చంపేసింది. తమిళనాడుకు చెందిన వెంకటేష్, హేమవతి దంపతులకు ఐదేళ్ల కుమారుడు, ఆరు నెలల పాప ఉన్నారు. వెంకటేష్ కోమటిగుంటలో ఇటుకల తయారీ పనుల కోసం
ఏడు నెలల కిందట ఎన్‌ఆర్ అగ్రహారం వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. భార్య హేమవతి ఇంట్లోనే ఉంటోంది. గురువారం ఉదయం పాప ఆకలితో ఏడ్చింది. వెంకటేష్ హేమవతిని పాలు ఇవ్వమని చెప్పి పనికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత భర్తకు ఫోన్ చేసి పాప ఆకలితో ఏడుస్తుంటే చంపేశానని చెప్పింది. వెంకటేష్ ఇంటికి వచ్చి చూసేసరికి పాప విగతజీవిగా కనిపించింది. వెంకటేష్ సత్యవేడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, హేమవతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
