Kurnool Highcourt : క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధాని హుళక్కే.!

క‌ర్నూలుకు ఇక హైకోర్టు లేన‌ట్టే. మూడు రాజ‌ధానుల అంశం జ‌గ‌న్‌ కోల్డ్ స్టోరేజిలో పడేసిన‌ట్టే కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - April 26, 2022 / 01:07 PM IST

క‌ర్నూలుకు ఇక హైకోర్టు లేన‌ట్టే. మూడు రాజ‌ధానుల అంశం జ‌గ‌న్‌ కోల్డ్ స్టోరేజిలో పడేసిన‌ట్టే కనిపిస్తోంది. మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తోన్న జ‌గ‌న్ స‌ర్కార్ న్యాయ వ్య‌వ‌స్థ దెబ్బ‌కు డీలా ప‌డింది. ఆ విష‌యాన్ని హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌, సీఎం మ‌ధ్య జ‌రిగిన భేటీ రుజువు చేస్తోంది. ఏపీ హైకోర్టుకు నూతన భవన నిర్మాణ పనులు, ఇత‌ర‌త్రా మౌలిక వ‌సతుల గురించి ఆ భేటీలో చర్చించార‌ని తెలిసింది. అంటే, ఇక క‌ర్నూలు హైకోర్టు త‌ర‌లింపు అనేది ఎన్నిక‌ల ప్ర‌చారంకు ప‌రిమితం అయింది. నూత‌న హైకోర్టు నిర్మాణ ప‌నుల‌పై ఉన్నత పరిపాలనా అధికారులు, రాష్ట ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలకు చెందిన ప్రధాన అధికారులు స‌మీక్షించారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సోమవారం సాయంత్రం సుమారు గంట సేపు వాళ్లిద్ద‌రి మ‌ధ్యా భేటీ జ‌రిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో సీఎం సమావేశం కావడం ఇదే తొలిసారి. కాగా, ఏప్రిల్‌ 4, 2016 నాటి ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతితో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.

ఆనాడు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌ను మరోసారి స‌మీక్షించారు. హైకోర్టుకు సంబంధించిన డిజైన్లు, మౌలిక వ‌స‌తులు త‌దిత‌రాల‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టార‌ని తెలుస్తోంది. దీనితో పాటు పేరుకుపోయిన కేసుల పరిష్కారం, న్యాయ సహాయంపై మార్గదర్శక ప్రణాళిక, న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ, ఈ-కోర్టులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. వీటికి సంబంధించి రాష్ట్రం నుంచి నివేదించనున్న అంశాలపై ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చర్చించారు. మొత్తం మీద హైకోర్టును త‌ర‌లిస్తామ‌న్న సీఎం జ‌గ‌న్ నూత‌న హైకోర్టు భ‌వ‌నాల గురించి హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ తో సంప్ర‌దింపులు జ‌రిపార‌న్న‌మాట‌. ఫ‌లితంగా క‌ర్నూలుకు హైకోర్టు నినాదం కేవ‌లం రాజ‌కీయ వ్యూహం మాత్ర‌మేన‌ని తేలుతోంది.