ఏపీలో ఆ జిల్లాలో పెరుగుతున్న రైతు ఆత్మ‌హ‌త్య‌లు… కార‌ణం ఇదేనా…?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని క‌ర్నూల్ జిల్లాలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతున్నాయి.

  • Written By:
  • Publish Date - November 27, 2021 / 03:43 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని క‌ర్నూల్ జిల్లాలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో 12 మంది రైతులు పురుగుమందు తాగి, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఈ క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకోవ‌డానికి గ‌ల కార‌ణం వ్య‌వ‌సాయంలో భారీగా న‌ష్టాల‌ను చవి చూశారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆత్మహత్యలు భారీగా తగ్గాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. జిల్లావ్యాప్తంగా రైతులు వరి, పత్తి, మిరప, మినుము, ఉల్లి, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేశారు. ఈ పంట‌ల‌ను సాగు చేయ‌డానికి ముందుగా పెట్టుబ‌డి పెట్టాల్సి వ‌స్తుంది. దీని కోసం వ‌డ్డీ వ్యాపారుల ద‌గ్గ‌ర రైతులు అధిక వ‌డ్డీకి తీసుకువ‌చ్చి భారీగా పెట్టుబ‌డులు పెట్టారు. అయితే ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలన్నీ దెబ్బతినడంతో రైతుల తీవ్రంగా న‌ష్ట‌పోయారు. దీంతో చేసేదేమీలేక…వడ్డీ వ్యాపారుల వద్ద చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక తీవ్ర మనస్తాపానికి గురైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

ఓర్వకల్ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన బోయ నాయని పాండు రంగడు (41) అనే రైతు ఉల్లి, మిర్చి, మొక్కజొన్న సాగు చేశాడు. ఐదున్నర ఎకరాల్లో పంటలు వేశాడు. మార్కెట్‌లో పండించిన పంటకు మంచి దిగుబడి, గిట్టుబాటు ధర వస్తుందని ఆశించాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతినడంతో పాటు రూ.7 లక్షల వరకు అప్పులపాలయ్యాయి.గత రెండేళ్లుగా పాండు రంగడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. పంటలన్నీ దిగుబడి దశలో ఉన్నందున ఈ ఏడాది మంచి రాబడులు వస్తాయని ఆశించాడు. అయితే అనూహ్యంగా కురిసిన వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో మనస్తాపానికి గురైన ఆయ‌న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు ఓర్వకల్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

తుగ్గలి మండలం రతన గ్రామంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మాల సుంకన్న అనే రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని ఎమ్మిగనూరు, రుద్రవరం, నంద్యాల మండలాల్లో కూడా మరికొందరు రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టినట్లు పోలీసు శాఖ అధికారిక నివేదిక వెల్లడించింది.
నివేదిక ప్రకారం నవంబర్ 25 వరకు 107 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ, 2020 లో క‌ర్నూల్‌ జిల్లాలో 141 (పురుషులు 139, ఇద్దరు మహిళలు) ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. 2017 నుండి 2021 నవంబర్ 25 వరకు మొత్తం 488 ఆత్మహత్య కేసులు (2017లో 62, 2018లో 69, 2019లో 108, 2020లో 141, 2021లో 107) నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 488 ఆత్మహత్యల్లో ఇద్దరు మహిళా రైతులు ఉన్న‌ట్లు పోలీసు శాఖ నివేదిక పేర్కొంది.