Site icon HashtagU Telugu

Fake Tweets : నేత‌ల‌కు `ఫేక్` ద‌డ‌

Fake Tweets

Fake Tweets

సోష‌ల్ మీడియాను ఫేక్ ట్వీట్ల వ్య‌వ‌హారం షేక్ చేస్తోంది. ఏపీలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల మ‌ధ్య ఫేక్ ట్వీట్ల వ్య‌వ‌హారం ముదిరింది. వాటిని పోస్టు చేసిన, ప్ర‌మోట్ చేసిన వాళ్ల మీద జ‌గ‌న్ స‌ర్కార్ క‌న్నేసింది. ఆ క్ర‌మంలో టీడీపీ లీడ‌ర్ గౌతు శిరీషను ఏపీ సీఐడీ విచారించింది. తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్లు దేవినేని ఉమ‌, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి పేర్లు ఫేక్ ట్వీట్లు ఇటీవ‌ల వైర‌ల్ కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పైగా ఉమ పేరుతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ట్వీట్ ను మంత్రి అంబ‌టి రాంబాబు ట్యాగ్ , ప్ర‌మోట్ చేయ‌డంతో టీడీపీ, వైసీపీ మ‌ధ్య వైరంగా మారింది.

నకిలీ ట్వీట్ ను విచిత్రంగా దేవినేని కి కూడా మంత్రి అంబ‌టి పంపారు. అంతేకాదు, అనేక మందికి పంపిన మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని దేవినేని డిమాండ్ చేశారు. ఆ మేర‌కు. సీఐడీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. నకిలీ ట్వీట్‌ను ప్రచారంలో పెట్టిన మంత్రి అంబటిపై మంగళవారం ఉదయం 11 గంటలకు సీఐడీ చీఫ్‌ను కలిసి ఫిర్యాదు చేసిన‌ట్టు మాజీ మంత్రి దేవినేని వెల్ల‌డించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ను విమర్శిస్తూ దేవినేని ట్వీట్‌ చేసినట్లు ఒక ఫేక్ ట్వీట్ వైరల్ అయింది. టీడీపీ నేతలైన వర్ల రామయ్య, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బచ్చుల అర్జునుడు సహా ప‌లువురి పేర్ల‌తో వైఎస్సార్‌సీపీ పేటీఎం బ్యాచ్ ఫేక్ ట్వీట్లు పెడుతున్నార‌ని దేవినేని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అధినేత చంద్రబాబు సంతకం, పార్టీ లెటర్ హెడ్ పోర్జరీ చేసి సోష‌ల్ మీడియాలో పెడుతున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

భాద్యత గల మంత్రి పదవిలో ఉన్న అంబటి రాంబాబు ఆ ఫేక్ ట్వీట్‌ను సమర్ధిస్తూ ట్వీట్ చేశారంటే అందులో ఉన్న కుట్రకోణం అర్దమవుతుందన్నారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఫేక్ ట్వీట్లను మంత్రి షేర్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై అంబటి రాంబాబును విచారించే దమ్ము సీఐడీ చీప్, పోలీసులకు ఉందా అని ప్రశ్నించారు. స్వాతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న మనువరాలు గౌతు శిరీష ఇంటికి సీఐడీ పోలీసులు అర్దరాత్రి వెళ్లి నోటీసులు ఇవ్వటం దుర్మార్గమన్నారు. ఆమెను సీఐడీ ఆపీస్‌కి పిలిచి ఉదయం నుంచి కనీసం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయకుండా వేధించారని దేవినేని గుర్తు చేశారు. ఏం కేసు పెడుతున్నారో కూడా నోటీసులో చెప్పకుండా విచారణకు పిలిచిన సీఐడీ మంత్రి అంబటి రాంబాబును ప్రశ్నించే దమ్ము దైర్యం సీఐడీ పోలీసులకు, ముఖ్యమంత్రికి ఉందా? అంటూ ప్ర‌శ్నించారు.

మహానాడు విజయంతో జగన్‌కు భయపట్టుకుందని టీడీపీ భావిస్తోంది. సజ్జల డైరక్షన్ తో మంత్రి రాంబాబు ఫేక్ ట్వీట్ ల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఫేక్ ట్వీట్ చేసినందుకు మంత్రి అంబటి రాజీనామా చేస్తారా లేక క్ష‌మాపణ చెబుతారా అని నిల‌దీశారు. అంబటిని మంత్రి పదవి నుంచి భర్తరప్ చేయాల‌ని డిమాండ్ చేశారు. పరిపాలన వైఫల్యంతోనే ఫేక్ ట్వీట్ చేస్తున్నారన్నారు. మొత్తం మీద టీడీపీ, జ‌న‌సేన పొత్తు అంశంపై ఫేక్ ట్వీట్ల‌తో సోష‌ల్ మీడియా నిండిపోతోంది. వాటిని చూసిన జ‌న సైనికులు రెచ్చిపోతున్నారు. దీంతో టీడీపీ అగ్ర‌నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇలాంటి ఫేక్ ట్వీట్ల‌పై ఏపీ సీఐడీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో చూద్దాం.!