Site icon HashtagU Telugu

Fake IPS: ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌లో న‌కిలీ ఐపీఎస్.. ఆయ‌నెవ‌రో కాదు?

Fake IPS

Fake IPS

Fake IPS: ఏపీలో ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సీఎంగా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు. ఈ ఇద్ద‌రూ ఏపీని అభివృద్ధి దిశ‌గా న‌డిపేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోన్నారు. అయితే ఇటీవ‌ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో నకిలీ ట్రైనీ ఐపీఎస్ అధికారి (Fake IPS) సూర్య ప్రకాష్ క‌ల‌క‌లం సృష్టించాడు. డిప్యూటీ సీఎం పర్యటన జరిగిన వారం రోజుల తర్వాత నకిలీ ట్రైనీ ఐపీఎస్ ని పోలీసులు గుర్తించ‌డం గ‌మ‌నార్హం.

ఏజెన్సీ పర్యటనలో నకిలీ ట్రైనీ ఐపీఎస్ సూర్య ప్రకాష్ కలకలం సృష్టించడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై డొల్లతనం బ‌య‌ట‌ప‌డింది. పవన్ కళ్యాణ్ భద్రత విషయాల్లో పోలీసుల అలసత్వంపై రాజ‌కీయం దుమారం చెలరేగుతోంది. పోలీసుల బాధ్యతారాహిత్యంపై హోం శాఖ, ఇంటిలిజెన్స్ బాధ్యత వహించాల‌ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.

Also Read: Plane Explosion : రన్‌వేపై ల్యాండ్ అవుతూ.. విమానం పేలి 47 మంది మృతి

అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు పోలీసులు ఉన్నారా లేరా అని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో పోలీసుల వ్యవహార శైలి వెనక జగన్ కారణమని కూటమి నేతలు చెప్పాల్సిందంటూ బొత్స‌ వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఇప్పటికే నకిలీ ట్రైనీ ఐపీఎస్ సూర్యప్రకాష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు విజయనగరం పోలీసులు తెలిపారు.

పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ట్రైనీ ఐపీఎస్ సూర్యప్రకాష్ బ‌య‌ట‌కు వచ్చాడని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్ర‌క‌టించారు. డిప్యూటీ సీఎం పర్యటనలో సభా వేదిక వద్ద అటు ఇటు తిరుగుతూ నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ క‌నిపించాడు. తన భూమి వివాదాన్ని పరిష్కరించుకోవడానికి పోలీస్ అవతారం ఎత్తినట్లు సూర్య ప్రకాష్ చెప్పిన‌ట్లు స‌మాచారం. లోకల్ గా ఉన్న ప్రజలు నమ్మకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు హాజరై ఫోటోలు తీసుకుని తమ ఊరు వాళ్లను మోసం చేయడానికి ప్రయత్నం చేసిన సూర్య ప్రకాష్ ఏకంగా చిక్కుల్లో ప‌డ్డారు.

ఎవ‌రీ సూర్య ప్ర‌కాష్‌?

విజయనగరం జిల్లా మెరకముడిదాం గ్రామానికి చెందిన బలివాడ సూర్య ప్రకాశ్ మాజీ సైనికుడ‌ని స‌మాచారం. ప్రస్తుతం ఆయ‌న‌ గరివిడి పట్టణంలో ఉంటున్నాడు. సూర్య ప్ర‌కాష్‌ తండ్రి తూనికలు, కొలతల శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. సైన్యంలో పనిచేసి వచ్చిన తర్వాత సూర్యప్రకాశ్ నకిలీ పోలీస్ అవ‌తారం ఎత్తిన‌ట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా తాను ఐపీఎస్ అధికారిగా చెప్పుకుంటూ స్థానికంగా సూర్య ప్ర‌కాష్‌ తిరుగుతున్నాడు. మాజీ సైనికుడు కావడంతో స్థానికులు కూడా ఐపీఎస్ వచ్చిందేమోనని నమ్మారు. ఇంకా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డ‌టంతో స్థానికులు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు.