Site icon HashtagU Telugu

Tirupati MP: తిరుపతి ఎంపీకి ‘కేటుగాడు’ జలక్

రూ.5 కోట్లు కావాలంటే రూ.25 లక్షలు డిపాజిట్‌ చేయండి. వెంటనే రూ.5 కోట్లకు డీడీ వచ్చేస్తుంది. ఇదీ డీల్‌. దీన్ని ఎవరైనా వదులుకుంటారా? డబ్బంటే ఎవరికి చేదు. ఆ డబ్బు ఆశే ఫేక్‌గాళ్లకు కలిసి వస్తోంది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆ ఫేక్‌గాళ్ల గురి నుంచి తప్పించుకున్నారు.

తిరుపతి ఎంపీ గురుమూర్తిని బురిడీ కొట్టించి పాతిక లక్షలు కొట్టేద్దామని ఒకడు ప్లాన్‌ చేశాడు. ఎంపీ పీఏ హరీష్‌కు ఫోన్‌ చేసి సీఎంవో నుంచి అభిషేక్‌ను మాట్లాడుతున్నా అని చెప్పుకొచ్చాడు. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఖాదీ అండ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ నుంచి ఐదు కోట్ల లోన్‌ ఓకే అయిందన్నది ఆ ఫోన్‌ కాల్‌ సారాంశం. ఆ లోన్‌ వెంటనే రావాలంటే 20 మంది లబ్దిదారుల తరపున ఒక్కొక్కరికి రూ.1.25 లక్షల చొప్పున 25 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని డిమాండ్‌ చేశాడు.
ఒక్కొక్కరికి రూ.25 లక్షల రుణం వస్తుందని, వెంటనే రూ.25 లక్షలు డిపాజిట్‌ చేస్తే ఐదు కోట్ల లోన్‌కి డీడీ వస్తుందని నమ్మించాడు. పైగా బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌, ఫోన్‌ నెంబర్లు, IFSC కోడ్‌ సహా అన్నీ ఇచ్చేశాడు.

ఈలోపే ఎంపీ పీఏకు ఎందుకో అనుమానం వచ్చి సీఎంవోలో ఇండస్ట్రీస్‌ డిపార్ట్‌మెంట్‌ చూసే అధికారులకు ఫోన్‌ చేసి ఎంక్వైరీ చేశారు. అసలు సీఎంవోలో అభిషేక్‌ అనే వ్యక్తే లేడని, కేంద్రం నుంచి ఎలాంటి లోన్‌ ఓకే కాలేదన్న కన్ఫర్మేషన్‌ వచ్చింది. ఆ వెంటనే ఎంపీ పీఏ మహేష్‌ తిరుపతి పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చారు.

పీఏ ఫిర్యాదుతో ఫోన్‌ వచ్చిన నెంబర్‌ ఆధారంగా కూపీలాగితే హైదరాబాద్‌లో ఆ ఫేక్‌గాడు దొరికిపోయాడు. సో ఎవరైనా ఇలాంటి ఆఫర్లు ఇస్తే వెంటనే టెంప్ట్‌ అవ్వొద్దు. అయ్యారో ఫేస్‌ చూడకుండానే గుండు గీసేస్తారు. తస్మాత్‌ జాగ్రత్త!