Failure Political IPS: ఫెయిల్యూర్ పొలిటికల్ ఐపీఎస్

రాజకీయాల్లో విఫలం చెందిన ఐపీఎస్, ఐఏఎస్ లు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు.

  • Written By:
  • Updated On - October 22, 2022 / 05:54 PM IST

రాజకీయాల్లో విఫలం చెందిన ఐపీఎస్, ఐఏఎస్ లు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. ఒక్క కేజ్రివాల్ మినహా దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో రాణించిన సివిల్ సెర్వెంట్ల సంఖ్య అరుదు. సీబీఐ డైరెక్టర్ పదవి వదులుకొని 2019 ఎన్నికల చిత్రంలో కనిపించిన వీవీ లక్ష్మీనారాయణ అలియాస్ జెడి లక్ష్మీనారాయణ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా మిగిలారు. ఇప్పుడు ఏదో ఒక పార్టీలో చేరడానికి తహతహ లాడుతున్నారు. అధికారం ఉంటేనే ప్రజాసేవ అనే సిద్ధాంతాన్ని బాగా వంట బట్టించుకున్నారు. పదవి కోసం ఆరాటపడుతున్నారు. జనసేన నుంచి బయటకు వచ్చిన ఆయన మళ్ళీ అటు వైపు చూస్తున్నారు.

తెలుగు రాజకీయాల్లో ఇండిపెండెంట్లు, కామ్రేడ్లు కూడా గత కొన్ని ఎన్నికల నుంచి ఎక్కడా కనిపించడంలేదు. అంటే వారి బలం ఎక్కడా సరిపోవడం లేదు. అందువల్ల లక్ష్మీనారాయణ ఏదో ఒక పార్టీ ని నమ్ముకుంటున్నారు. అయితే ఆయన ఒక పార్టీ ఇమేజ్ ని మించి వ్యక్తిగతంగా తెచ్చుకున్న పేరు మసకబారింది. విశాఖ వంటి చోట మేధావులు విద్యావంతులు యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.దాంతో ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య మీద అందరి కంటే భిన్నంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. హైకోర్టు లో దీని మీద పిటిషన్ వేసి కేంద్రానికి నోటీసులు ఇప్పించేలా చూశారు. ఒక విధంగా కేంద్రం దీని మీద ఏం జవాబు చెబుతుందో చూడాలి. స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద ఆయన పోరాటం చిత్తశుద్ధితో కూడుకున్నదని అభిమానులు భావిస్తున్నారు.మొత్తానికి జేడీ విశాఖ బరిలో ఉంటే ఎన్నిక ఆసక్తికరం అనే చెప్పాలి. పార్టీ విదానాలను కాస్తా పక్కన పెట్టి ఆలోచిస్తే ఆయన కంటే మంచి అభ్యర్ధి ఉండరని కొందరి భావన. గత ఎన్నికల్లో జేడీకి అదృష్టం జారింది. మరి ఈసారి అయినా ఆయన ఎంపీగా నెగ్గుతారా? అంటే అనుమానమే.

ఆనాడు జగన్ ఆస్తుల కేసు విచారించడంతో అమాంతం తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు పేరు వచ్చింది. సీబీఐ జేడీ గా పనిచేయడంతో అదే ఇంటి పేరు అయింది. పుట్టింది సీమ జిల్లా కర్నూల్ ప్రాంతంలో అయినా విశాఖ మీద మక్కువ పెంచుకున్నారు. ఒక విధంగా ఆ ప్రాంతాన్ని తన పుట్టిల్లుగా చేసుకుని సమస్యల మీద తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారు.ఆయన 2019 ఎన్నికల్లో తొలిసారి విశాఖ నుంచి పోటీ చేసినపుడు జనసేనను ఎంచుకున్నారు. ఆయన తొలిసారి పోటీ చేసినా కూడా రెండు లక్షల ఎనభై వేల పై చిలుకు ఓట్లు సాధించారు. ఒక విధంగా అది ఆయన వ్యక్తిగత ఇమేజ్ గానే అంతా చూశారు. యువతకు విద్యార్ధులకు మేధో వర్గానికి ఆయన దగ్గరయ్యారు. ఆ విధంగా సాధించిన ఇమేజ్ తో ఆయన కేవలం పది రోజుల ప్రచారంలోనే ఆ స్థాయి ఓట్లను సాధించారు.

ఆ తరువాత ఆయన జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చారు. బీజేపీలో చేరుతారని ఆప్ కి నాయకత్వం వహిస్తారని లేక టీడీపీ నుంచి బరిలో ఉంటారని అనేక వార్తలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం ఇపుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానే విశాఖ నుంచి పోటీ చేయాలని. నిజానికి ఇపుడున్న రాజకీయాల్లో లక్ష్మీనారాయణ తీసుకున్న నిర్ణయం చాలా సాహసంతో కూడుకున్నదే. ఏ పార్టీలోకి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి ఆయన రాజకీయ ప్రయాణంలో కనిపిస్తుంది. అందుకే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని యోచిస్తున్నారని తెలుస్తుంది.