Site icon HashtagU Telugu

AP Cabinet: ఏపీలో వారి వల్లే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ వాయిదా పడుతోందా?

Ys Jagan Nampally Special Court

Ys Jagan Nampally Special Court

ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం వైసీపీని షేక్ చేస్తోంది. ఇప్పటికే మంత్రి పదవులు పోతాయి అనుకున్నవారి ధోరణి మారిపోయిందని సమాచారం. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో మొక్కుబడిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీనివల్లే ఎప్పటికప్పుడు క్యాబినెట్ ను మార్చే తేదీలు మారిపోతున్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏపీ హోం శాఖా మంత్రి సుచరిత.. అసలు సమావేశాలకే రాకపోవడం దీనికి నిదర్శనంగా చూపిస్తున్నారు. కాకపోతే అనారోగ్య కారణాల వల్లే సెషన్ కు రాలేకపోతున్నట్టు ఆమె సీఎం కు తెలిపినట్టు సమాచారం.

ఇక ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహారం కూడా ఇలాగే ఉంది. సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై ఆయనే సమాధానం ఇవ్వాల్సి ఉంది. కానీ ఆయనకు బదులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానమిచ్చారు. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. నిజానికి రాష్ట్రానికి అప్పులు తేవడంలో బుగ్గన పాత్ర చాలా కీలకం. అయినా సరే తన శాఖలో జరుగుతున్న వ్యవహారాలు ఆయనను కలవరపెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక సీఎంవో ఫైనల్ చేసిన బడ్జెట్ ప్రసంగంలోనూ బుగ్గన కొన్ని మార్పులుచేర్పులు చేశారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన చర్చలో కొన్ని అంశాలపై ఆయన సమాధానాలు ఇవ్వకపోవడం, ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయణస్వామి కూడా మద్యం విధానంపై జరిగిన చర్చకు సమాధానం చెప్పకపోవడంతో సీఎం జగనే వాటికి జవాబిచ్చారు. వీరి సంగతి అలా ఉంచితే.. క్యాబినెట్ ను ఎప్పుడు పునర్వ్యవస్థీకరిస్తారా.. ఎప్పుడు మంత్రి పదవి దక్కుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నవారిలో టెన్షన్ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు తేదీ మారుతుండడంతో అసలా మార్పు ఉంటుందా లేదా అన్న అనుమానాలు వారిలో ముసురుకున్నాయి.

ఈమధ్యే వైసీఎల్పీ భేటీ కూడా జరిగింది. దీనికి హాజరైన మంత్రులు కొందరు అదే రోజున ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ మంత్రిపదవులపైనా.. రాజకీయ భవిష్యత్తుపైనా వారు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వైపీసీ పెద్దలు అలర్ట్ అయినట్టు సమాచారం. అందుకే క్యాబినెట్ ను వెంటనే ప్రక్షాళన చేయకుండా వాయిదా వేశారంటున్నాయి. పైగా ఇప్పుడు మంత్రి పదవుల నుంచి తొలగిస్తారని ప్రచారం జరుగుతున్న వారితోపాటు.. కొత్తగా మంత్రిపదవులు వచ్చేవారికి.. జిల్లాల్లో ఎమ్మెల్యేలందరినీ గెలిపించే బాధ్యతలు అప్పజెప్పనున్నట్టు తెలుస్తోంది. ఇది తలకు మించిన భారమని వారి ఆవేదన. అయినా మూడేళ్ల కిందట ఎలా ఉండే పార్టీ ఎలా అయిపోయిందా అని వారు ఆవేదన చెందుతున్నారు.