ఏపీలో ప్రభుత్వఉద్యోగులకు షాకిచ్చింది జగన్ సర్కార్. గత కొన్నాళ్లుగా ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరణమ వయస్సుపై దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నిబంధన ఎవరికి వర్తిస్తుందన్న దానిపై ఎన్నో రకాల చర్చలు కొనసాగోతోన్నాయి. ఈ నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది సర్కార్. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ ఇచ్చిన జీవోపై కీలక వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వం. ఈ జీవో అందరికీ వర్తించదని ఏపీ ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్నవారికీ మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. వారి పదవీ విరమణ వయస్సు 62ఏళ్లకు పెంచినట్లు తెలిపింది.
కాగా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీలు, పలు యూనివర్సిటిల్లో ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపు వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం తగదని తేల్చి చెప్పింది ప్రభుత్వం. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు ఇస్తూ..ప్రభుత్వ సర్వీసులో పనిచేసేవారికి మాత్రమే పదవీ విరమణ పెంచినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ అంశానికి సంబంధించి నివేదికను సమర్పించాలంటూ ఆయా సంస్థలకు ఆర్థికశాఖ అదేశాలు జారీ చేసింది. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. యూనివర్సిటీలు, ఎయిడెడ్, గురుకులాలు, సొసైటీలు, లైబ్రరీస్, పబ్లిక్ సెక్టార్ వంటి రంగాల ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు.