Ex MLA Veera Siva Reddy : టీడీపీలో చేరిన కొలికపూడి.. ముసుగు వీడిందంటూ వైసీపీ విమర్శలు

  • Written By:
  • Publish Date - January 27, 2024 / 10:21 AM IST

ఏపీ(AP)లో ఎన్నికల సమయం (2024 Elections) దగ్గర పడుతుండడం తో వలసల పర్వం రోజు రోజుకు ఎక్కవైపోతుంది. ముఖ్యంగా జనసేన – టిడిపి (TDP-Janasena) కూటమి లోకి పెద్ద ఎత్తున నేతలు వచ్చి చేరుతున్నారు. గత ఎన్నికల్లో ఎలాగైతే అధికార పార్టీ వైసీపీ (YCP) లో చేరారో..ఇప్పుడు అదే స్థాయిలో టిడిపిలో చేరుతున్నారు. టికెట్ రాని నేతలతో పాటు ఈసారి విజయం టిడిపి దే అని ధీమా గా ఉన్న నేతలంతా సైకిల్ ఎక్కుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది నేతలు టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..తాజాగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి (Veera Siva Reddy), రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు , అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) చంద్రబాబు (Chandrababu) సమక్షం లో నిన్న పార్టీ లో చేరారు.

చంద్రబాబు వీళ్లిద్దరికీ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించాడు. ఇది ఇలా ఉండగా అమరావతి రైతుల పక్షాన పోరాడుతూ, ఎన్నో ఉద్యమాలు చేసిన కొలికిపూడి టీడీపీ లో చేరడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైసీపీ నాయకులు చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ఎట్టకేలకు ముసుకు తొలగించి టీడీపీ కండువా కప్పేసుకున్న ముసుగు మేధావి కొలికపూడి’ అంటూ సోషల్ మీడియా లో విమర్శల వర్షం కురిపించారు. ఇన్ని రోజులు ఈ మేధావి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నాడని మేము చెప్తే మీరు నమ్మలేదు, ఇప్పుడు చూడండి అంటూ వైసీపీ పార్టీ నాయకులు సోషల్ మీడియా లో పోస్టులు వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు టీడీపీ పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని పార్టీలో చేరిన నేతలు చెప్పుకొచ్చారు. రాష్ట్రం కోసం, యువత భవిష్యత్ కోసం రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీని గెలిపించేందుకు పనిచేస్తామని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు. ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని దించేందుకు కలిసి వచ్చిన నేతలను చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

క‌మ‌లాపురం నియోజకవర్గానికి చెందిన వీర‌శివారెడ్డి.. టీడీపీతోనే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1994లో తొలిసారి టీడీపీ అభ్యర్థిగా క‌మ‌లాపురం నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. త‌ర్వాత 1999 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంవీ మైసూరారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2004లో టీడీపీ అభ్యర్థిగా మ‌ళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసినా ఓటమి తప్పలేదు. 2009 ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుంచే గెలపొందారు.

ఆ తర్వాత, ఆంధ్రప్రదేశ్ విభజన, ఇతర పరిణామాలతో 2014, 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ లో చేరారు. కానీ పెద్దగా అక్కడ తగినంత ప్రాధాన్యత దక్కడం లేదంటూ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ఇప్పుడు సొంత గూటికే వచ్చేసారు.

Read Also : Manipur Tableau : మణిపుర్ శకటంపై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు