Pedda Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత మరోసారి ఉస్సురుమంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Pedda Reddy) గత ఏడాది కాలంగా తన సొంత నియోజకవర్గమైన తాడిపత్రిలోని ఇంటికి రాకుండా ఉంటూ వచ్చారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు, శాంతిభద్రతల సమస్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను తాడిపత్రిలోకి అనుమతించలేదు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ శాంతిభద్రతల పేరుతో పెద్దారెడ్డిని అడ్డుకుంటూ వచ్చిన పోలీసులు, ఈ రోజు ఉదయం ఆయన తాడిపత్రిలోని సొంత ఇంటికి చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు.
పెద్దారెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తాడిపత్రి చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను తాడిపత్రిలోని నివాసంలోనే అరెస్టు చేసిన పోలీసులు అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించినట్లు సమాచారం. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. నిన్న మున్సిపల్ సిబ్బంది పెద్దారెడ్డి ఇంటిని కొలతలు వేసినట్లు, అలాగే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తన ఇంటిలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: Stampede: మరో తొక్కిసలాట.. ముగ్గురు భక్తులు మృతి, 50 మందికి గాయాలు.. వీడియో ఇదే!
తాడిపత్రిలో గతంలో జరిగిన హింసాత్మక సంఘటనలు, ఎన్నికల అనంతర గొడవల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. పెద్దారెడ్డి హైకోర్టు బెయిల్ పొందినప్పటికీ శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు ఆయనను అనుమతించలేదు. పెద్దారెడ్డి తన నియోజకవర్గంలోకి రావడానికి అనుమతి కోరుతూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తాడిపత్రిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పట్టణంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.
పోలీసుల రియాక్షన్ ఇదే
పెద్దారెడ్డి తాడిపత్రి రాకపై పోలీసుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాడిపత్రిలోకి వస్తే పోలీసులకు చెప్పి రావాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని అన్నారు. కానీ పోలీసులకు చెప్పకుండా తాడిపత్రి పట్టణంలోకి పెద్దారెడ్డి రావడంతో పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ పెద్దారెడ్డి పై పోలీసుల సీరియస్ అవుతున్నారు. ఇవాళ జరిగిన పరిణామాలపై పోలీసులు హైకోర్టుకు నివేదించే అవకాశం ఉంది.