Site icon HashtagU Telugu

TDP : ఆస‌క్తిగా మారిన కృష్ణాజిల్లా రాజ‌కీయం.. టీడీపీ ఎంపీతో భేటి అయిన వైసీపీ ఎమ్మెల్యే తండ్రి

vasantha Nageswararo

vasantha Nageswararo

మైల‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ తండ్రి మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు టీడీపీ ఎంపీ కేశినేని నానిని క‌లిశారు. విజ‌య‌వాడ‌లోని ఎంపీ కార్యాల‌యంకి వెళ్లిన ఆయ‌న కేశినేని నానితో మాట్లాడారు. ఎంపీ కేశినేని నాని తాత కేశినేని వెంకయ్యతో తనకున్న సాన్నిహిత్యాన్నివ‌సంత నాగేశ్వ‌ర‌రావు గుర్తుచేసుకున్నారు. అనేక సామాజిక, రాజకీయ అంశాలను చర్చించడమే కాక కేశినేని నాని రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయ‌న ప్ర‌శంసించారు. అయితే వీరిద్ద‌రు భేటిపై కృష్ణాజిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఇటీవ‌ల కాలంలో మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు రాజ‌ధాని అంశంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రాజధాని కోసం 32 వేల ఎకరాలు ఇచ్చిన ఘనత ప్రపంచంలో ఒక్క అమరావతి రైతులకే దక్కుతుందని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. 29 గ్రామాల రైతులు తమ భూములను త్యాగం చేశారని, వారికి జేజేలు పలుకుతున్నట్టు చెప్పారు. ఈ వ్యాఖ్య‌లు చేసిన మ‌రుస‌టి రోజే ఆయ‌న కుమారుడు మైల‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ త‌న తండ్రి వ్యాఖ్య‌లు ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మంటూ పార్టీకి సంబంధం లేదంటూ చెప్పుకోచ్చారు.

ఇటు జ‌గన్ కేబినెట్ విస్త‌ర‌ణ‌పై కూడా వ‌సంత నాగేశ్వ‌ర‌రావు కామెంట్స్ చేశారు. కెబినేట్ లో క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి ప్రాధన్య‌త లేక‌పోవ‌డాన్ని ఆయ‌న ప్ర‌శ్నించారు. గ‌తంలో చాలా మంది ముఖ్య‌మంత్రులు ప‌ని చేశార‌ని వారంతా క‌మ్మ‌వారికి ప్రాధాన్య‌త ఇచ్చార‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై కూడా వ‌సంత నాగేశ్వ‌రారావు ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్ వంటి ఓ మహనీయుడు పేరు మార్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ మహానీయుడని.. ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని కామెంట్ చేశారు. ఈ నిర్ణయం త‌న‌ను బాధకలిగించిందన్నారు.

మ‌రోవైపు మైల‌వ‌రంలో వైసీపీ నేత‌లే త‌న‌కు వెన్నుపోటుపోడుస్తున్నార‌ని వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ వ్యాఖ్య‌లు చేయ‌డంపై వైసీపీలో చ‌ర్చ జ‌రుగుతుంది. మంత్రి జోగి ర‌మేష్ మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ చేసిన కామెంట్స్‌పై అధిష్టానం పిలిచి ఇద్ద‌రిని మంద‌లించింది. అయిన‌ప్ప‌టికీ వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కాస్త అంస‌తృప్తితోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇటు ఆయ‌న తండ్రి చేస్తున్న వ్యాఖ్య‌లు, తాజాగా ఎంపీ కేశినేని నానిని క‌ల‌వ‌డం లాంటి ప‌రిణామాలు అన్నీ పార్టీ మార్పుకే సంకేత‌మ‌ని జిల్లా రాజ‌కీయాల్లో చర్చ జ‌రుగుతుంది.