Nellore : నెల్లూరు కోర్టులో చోరీ ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ స్వాగ‌తిస్తున్నా – మాజీ మంత్రి సోమిరెడ్డి

నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి కేసు ఫైళ్లు చోరీ ఘ‌ట‌న‌ను సీబీఐకి అప్ప‌గిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణ‌యాన్ని...

  • Written By:
  • Publish Date - November 25, 2022 / 06:54 AM IST

నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి కేసు ఫైళ్లు చోరీ ఘ‌ట‌న‌ను సీబీఐకి అప్ప‌గిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి తెలిపారు. దేనికైనా దిగజారే మనస్థత్వం కలిగిన గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేస్తాడని తాను అనుకోవ‌డం లేదన్నారు. న్యాయవ్యవస్థకే మాయని మచ్చ తెచ్చిన ఈ కేసులో సీబీఐ విచారణను హైకోర్టు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తున్నాన‌ని సోమిరెడ్డి తెలిపారు. కీలక కేసు డాక్యుమెంట్లు మాయం కావడాన్ని పాత ఇనుము దొంగల పనిగా తేల్చిన ఎస్పీ విజయరావుతో పాటు మరికొందరు అధికారులు నెల్లూరులో ఉంటే సీబీఐ విచారణ సక్రమంగా జరిగే పరిస్థితి లేదన్నారు.

త‌న‌కు, త‌న‌ కుటుంబానికి విదేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులున్నాయని 2016లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి నకిలీ పత్రాలు సృష్టించారని..విదేశాలకు వెళ్లినట్ట వీసాలు, పాసుపోర్టులు, ఇమ్మిగ్రేషన్ స్టాంపులతో పాటు అక్కడి బ్యాంకుల్లో నగదు నిల్వలున్నట్టు, ఫాంహౌస్ లు ఇతర ఆస్తులున్నట్లు నకిలీ పత్రాలు చూపించారని తెలిపారు. ఆ నకిలీ డాక్యుమెంట్లపై అప్పుడే తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ జరిపారన్నారు.

డాక్యుమెంట్లు తయారుచేసిన ముఠాను అప్పట్లోనే పోలీసులు అరెస్ట్ చేయగా, వాటిని చేయించిన కాకాణి సుప్రీంకోర్టుకు వెళ్లి కండీషన్ బెయిల్ తెచ్చుకున్నారని తెలిపారు. ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, ఆధారాలను కోర్టులో సమర్పించారన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 11న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తెల్లారే అంటే 13వ తేదీ కోర్టులోని ఆ కేసు ఫైలు చోరీకి గురైందని సోమిరెడ్డి తెలిపారు. కోర్టులో ఉన్న కాకాణి కేసు ఆధారాలు చోరీకి గురికావడాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ తీవ్రమైనదిగా పరిగణించి సుమోటోగా కేసు స్వీకరించిందని గుర్తు చేశారు. ఘోరమైన నేరాలు చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రిగా రైతులకు న్యాయం చేసే పరిస్థితి లేదని…..తక్షణమే ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.