Site icon HashtagU Telugu

Ex Minister Narayana : రాజ‌మండ్రి జైల్లో చంద్ర‌బాబుతో మాజీ మంత్రి నారాయ‌ణ ములాఖ‌త్‌.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై త‌మ‌కు..?

Narayana

Narayana

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఆదరణ చూసి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం తట్టుకోలేక మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిందని మాజీ మంత్రి నారాయణ విమర్శించారు. అయితే తమకు కోర్టులపై పూర్తి నమ్మకం ఉందని, కోర్టులో న్యాయం జరుగుతుందని ఆయ‌న విశ్వాసం వ్యక్తం చేశారు. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న నారా చంద్రబాబు నాయుడును నారాయ‌ణ క‌లిశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ మృతి పట్ల మీడియాకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయాలని చంద్రబాబు తనతో చెప్పారని తెలిపారు. తనను అక్రమంగా అరెస్టు చేయడంపై నిర‌స‌న తెలిపిన తెలుగుదేశం పార్టీకి, ఏపీ ప్రజలకు అండగా నిలిచిన అన్ని పార్టీల నాయకులకు, వివిధ రంగాల ప్రముఖులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నారాయణ తెలిపారు. ప్రజలతో మమేకమై శాంతియుతంగా పోరాటాన్ని కొనసాగించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు చంద్ర‌బాబు నాయుడు దిశానిర్దేశం చేసినట్లు ఆయన తెలిపారు.

చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రజల గురించి, వారి సంక్షేమం గురించే ఉంటుందని నారాయణ అన్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో నారా లోకేష్‌ పేరును చేర్చిన నేపథ్యంలో ఆయనకు 41ఎ నోటీసులు జారీ చేయాలని కోర్టు సీఐడీని ఆదేశించడం సానుకూల పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అణచివేత చర్యల వల్ల ప్రజల్లో టీడీపీకి మద్దతు పెరుగుతుందన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబును అరెస్టు చేయడం వెనుక రాజకీయక‌క్ష కారణమని అందరికీ తెలుసునని అన్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టులో తనకు లబ్ధి చేకూరిందన్న ప్రభుత్వ ఆరోపణను నారాయణ తోసిపుచ్చారు. 2001లో తాను కొనుగోలు చేసిన మొత్తం భూమిని రింగ్‌రోడ్డు నిర్మాణంలో చేర్చారని, దాని విలువ రూ.7 కోట్లుగా నిర్ధారించారు. ఈ విషయాన్ని స్వయంగా సీఆర్డీయే తెలియజేసిందని తెలిపారు. రింగురోడ్డుకు ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో తన బంధువుల ప్లాట్లు ఉన్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన పొత్తుపై ఎలాంటి గందరగోళం లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. సమన్వయ కమిటీలు వేసి రెండు పార్టీలు కలిసి ముందుకు సాగుతామని నారాయణ తెలిపారు.

Exit mobile version