Amaravathi : ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి నాలుగేళ్లు : మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు

ఈ ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి నాలుగేళ్లు అయ్యిందని మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు

  • Written By:
  • Publish Date - December 16, 2023 / 06:25 PM IST

ఈ ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి నాలుగేళ్లు అయ్యిందని మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు అన్నారు. టీడీపీ హాయాంలో సన్ రైజ్ స్టేట్ గా విలసిల్లిన రాష్ట్రాన్ని, జగన్ రెడ్డి కామెడీ స్టేట్ గా మార్చార‌ని.. రాష్ట్రానికి రాజధాని ఏది అనే ప్రశ్నకు సమాధానం లేకుండా చేసినందుకు నిజంగా ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ఎవరు కట్టిన భవనాల్లో ఉంటూ.. ఎవరిచ్చిన భూముల్లో తిరుగుతూ చట్టాలు చేస్తున్నాడో ముఖ్యమంత్రి ఆలోచించుకోవాల‌న్నారు. ప్రజలకోసం, రాష్ట్రం కోసం నిర్మించతలపెట్టిన అమరావతిని పూర్తిచేయలేని జగన్ రెడ్డి, నిస్సిగ్గుగా మూడు రాజధానులంటూ రాష్ట్రం పరువు తీశార‌ని నక్కా ఆనంద్‌బాబు మండిప‌డ్డారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు నాలుగేళ్లుగా ఈ ముఖ్యమంత్రి దురాగతా లపై పోరాడుతున్నారని.. అమరావతి ప్రాంతంలోని రైతులు, రైతుకూలీలపై జగన్ రెడ్డి 1700లకు పైగా అక్రమ కేసులు పెట్టించారని ఆయ‌న ఆరోపించారు. ముఖ్యంగా దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బేడీలు వేసి వారిని రోడ్లపై తిప్పార‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు నాయుడి హాయాంలోనే రాజధాని అమరావతిలో సచివాలయం.. హైకోర్టు భవనం.. ప్రజావేదిక వంటి అనేక భవనాలు నిర్మించడం జరిగిందని ఆయ‌న గుర్తు చేశారు. ఎమ్మెల్యేల నివాసం కోసం నిర్మించిన క్వార్టర్స్.. ఉద్యోగుల కోసం వసతి గృహాల సముదాయం వంటి నిర్మాణాలు దాదాపు 90శాతం వరకు టీడీపీప్రభుత్వంలోనే పూర్తయ్యాయన్నారు. రూ.10 వేలకోట్లు వెచ్చించి వివిధ నిర్మాణాలు చేయడం జరిగిందని.. అలానే పేదలకోసం టిడ్కో ఇళ్లు నిర్మించడం జరిగిందన్నారు. 90శాతం పూర్తైన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా, వాటిని కూడా జగన్ రెడ్డి నాలుగేళ్లపాటు నిరుపయోగంగా గాలికి వదిలేశార‌ని ఆరోపించారు. ఈ ముఖ్యమంత్రి.. వైసీపీనేతలు.. దండుపా ళ్యం ముఠాకంటే దారుణంగా అమరావతిని దోచేశారని ఆరోపించారు. చివరకు టీడీపీప్రభుత్వం నిర్మాణాలకోసం తరలించిన సామగ్రిని, ఆఖరికి రోడ్లను కూడా తవ్వుకొని కంకర, మట్టిని అమ్ముకునే దుస్థితికి జగన్ రెడ్డి ముఠా దిగజారిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి అమరావతికి మద్ధతు తెలిపార‌ని.. ఆనాడే అభ్యంతరం తెలిపి ఉంటే, భూములిచ్చే ముందు రైతులు ఆలోచించేవారేమోన‌న్నారు. విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి ఒక రాజధాని మాత్రమే ఇచ్చారు. అది అమరావతేనని ఎప్పుడో నిర్ణయించారని తెలిపారు.

Also Read:  TS : గతంలో మంత్రులకు సైతం ప్రవేశం లేని ప్రగతి భవన్ కు ఈరోజు సామాన్య ప్రజలు వస్తున్నారు – రేవంత్