TDP vs YCP : బాబాయ్ హ‌త్య కేసులో నైతిక భాధ్య‌త వ‌హిస్తూ జ‌గ‌న్ రాజీనామా చేయాలి – మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్‌

వైఎస్ వివేకా హత్యకేసులో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రెడ్డి రాజీనామా చేయాల‌ని మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ డిమాండ్ చేశారు...

  • Written By:
  • Publish Date - October 20, 2022 / 12:10 PM IST

వైఎస్ వివేకా హత్యకేసులో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రెడ్డి రాజీనామా చేయాల‌ని మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ డిమాండ్ చేశారు. కేసు విచారణను పక్క రాష్ట్రానికి మార్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు. కేసు విచారణ ఏపీలో జరిగితే కొలిక్కరాదన్న అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలపై జగన్ రెడ్డికి సిగ్గుగా అనిపించడం లేదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. వైఎస్ వివేకా కుమార్తె, జగన్ రెడ్డి సోదరి వైఎస్ సునీత తన తండ్రి హత్య కేసును ఇతర రాష్ట్రానికి బదలాయించమని కోరడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు.. వివేకా హత్యకేసును ఛేదించలేకపోయిన డీజీపీ కూడా తన పదవికి రాజీనామా చేయాల‌ని జ‌వ‌హ‌ర్ డిమాండ్ చేశారు. వివేకా కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ముమ్మాటికి నేరస్థుడని ఆయ‌న ఆరోపించారు. నేరస్థుడిని కాపాడేందుకు జగన్ రెడ్డి పడుతున్న తాపత్రయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని.. వైఎస్ సునీతారెడ్డికి ఏపీ పోలీసులపై నమ్మకం లేద‌ని… అందుకే తన తండ్రి హత్య కేసును పక్క రాష్ట్రాలకు బదలాయించమని కోరుతున్నారన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని జ‌వ‌హ‌ర్ ఆరోపించారు. సొంత బాబాయి కేసునే పక్కదారి పట్టిస్తున్న జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి ఏం మేలు చేయగలరు? అని ప్ర‌శ్నించారు.