Balineni Srinivasa Reddy: వైసీపీ అధినేత జగన్‌కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) ఝలక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. జగన్‌కు రాజీనామా లేఖను పంపినట్లు పేర్కొన్నారు. కొద్దిరోజులుగా పార్టీలో తనకు అవమానం జరుగుతుందని ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే ఆయనను బుజ్జగించేందుకు మాజీ మంత్రి విడదల రజనిని జగన్ రంగంలోకి దింపినప్పటికీ.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అంతేకాకుండా తాజాగా జగన్‌తో జరిగిన చర్చలు కూడా విఫలం కావడంతో బాలినేని వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
రేపు పవన్‌తో భేటీ.. జనసేనలోకి బాలినేని?
ఈ క్రమంలోనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రేపు జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని.. రేపు (గురువారం) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నట్లు సమాచారం అందుతోంది. ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని ఐదుసార్లు గెలిచారు. జిల్లాలో రాజకీయంగా తిరుగులేని ఆధిపత్యాన్ని ఆయన చలాయించారు. వైసీపీలో చేరిన తర్వాత ఆయనను వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో వైసీపీ నుంచి ఆయన బయటకు రాక తప్పలేదని బాలినేని వర్గాలు చెబుతున్నాయి.
Also Read: PF Withdraw: పీఎఫ్ రూల్స్ ఛేంజ్ చేసిన కేంద్రం.. మార్పులు ఏంటంటే..?
ఇకపోతే ఏపీలో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 ఎమ్మెల్యేలు, 4 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. వైసీపీకి ఇప్పటికే పలువురు కీలక నేతలు రాజకీయ భవిష్యత్తు పరంగా వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. మరోవైపు జగన్ కూడా పార్టీలో కీలక మార్పులు చేపట్టారు. ఈ మార్పుల వలనే ఉన్న రాజకీయ నాయకులు కూడా అధికార పార్టీల వైపు చూస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలోని జనసేన పావులు కదుపుతోంది. అందుకోసమే సామాజిక వర్గాలను, వారి పనితీరును బట్టి పార్టీలో జాయిన్ చేసుకుంటుంది. బాలినేనితో పాటు మరికొంతమంది నాయకులు కూడా జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మున్ముందు ఇంకా ఎంతమంది వైసీపీకి షాక్ ఇస్తారో చూడాలి.