లేటుగానైన లేటెస్ట్ గా.. కమ్మ సామాజికవర్గానికి జరుగుతోన్న అన్యాయంపై మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు గళంమెత్తారు. ఆయన కుమారుడు వసంత కృష్ణప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మైలవరం నుంచి ఉన్నారు. రెండోసారి జగన్ మోహన్ రెడ్డి రూపొందించిన క్యాబినెట్ 2.0లో స్థానం కోసం ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. తొలి క్యాబినెట్ లో కమ్మ సామాజికవర్గం నుంచి ఒకేఒక మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని మంత్రివర్గం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ విషయాన్ని సీనియర్ పొలిటిషియన్ వసంత నాగేశ్వరరావు గుర్తు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి వాలకంపై సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇతర అగ్ర కులాలతో పాటుగా కమ్మ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన జగన్ మోహన్ రెడ్డి విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్తజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. దీంతో జిల్లాలోని కమ్మ సామాజికవర్గం సంబరపడి సీఎంకు సన్మానాలను చేసింది. ఆ ఆనందాన్ని ఆస్వాదించకముందే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ ను తొలగించారు. ఇదే విషయాన్ని వసంత గుర్తు చేస్తూ ఏపీలో జరుగుతోన్న పరిణామాలపై ఆవేదన చెందుతూ జగన్ మోహన్ రెడ్డికి చురకలు వేశారు. ఆయన గళం విన్న వాళ్లంతా వసంత ఫ్యామిలీ వైసీపీకి గుడ్ బై చెబుతోందని ప్రచారం మొదలు పెట్టారు. దీంతో వివరణ ఇవ్వడానికి నాగేశ్వరరావు కుమారుడు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రంగంలోకి దిగారు. నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు.
Also Read: AP Politics : చంద్రబాబు మాటలపై జగన్ రివర్స్
రాజధాని కోసం 32 వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులను నాగేశ్వరరావు ప్రశంసించారు. అమరావతి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతంగా ఎందుకు గుర్తించడంలేదని జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కమ్మ సామాజికవర్గానికి ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహించారు. అంతేకాదు, విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చినా స్పందించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రజలుండటం బాధాకరమని ఆవేదన చెందారు. జగ్గయ్యపేటలో కాకతీయ సేవా సమితి నిర్వహించిన వన సమారాధనలో పాల్గొన్న ఆయన రాష్ట్ర రాజకీయాల పైన స్పందించారు. గుంటూరు-విజయవాడ మధ్య అమరావతి రాజధానిగా ఉండటం హర్షణీయమని, రాష్ట్రాభివృద్ధికి చిహ్నమని వసంత అభిప్రాయపడ్డారు. విజయవాడలో రైల్వే జంక్షన్, విమానాశ్రయం, కృష్ణా నదిలో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్ పేర్లతో అనేక నిర్మాణాలు ఉన్నాయని గుర్తు చేస్తూ, వాటిని మార్చే ప్రయత్నం చేయలేదని జగన్ కు చురకలేశారు. ఏపీలో కంటే తెలంగాణ అసెంబ్లీలో కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉందని కొనియాడారు. కమ్మ సామాజిక వర్గంలో దాదాపు 35శాతం మంది ఓటర్లు జగన్ మోహన్ రెడ్డిని 2019 ఎన్నికల్లో ఆదరించారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్ర ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో ఓడిపోయిన తనను ఆప్కాబ్ ఛైర్మన్‌గా వైఎస్సార్ నియమించిన విషయాన్ని అవలోకనం చేశారు. స్వర్గీయ వైఎస్ అన్ని వర్గాలను గౌరవించే వారని కొనియాడారు. అప్పట్లో ఇద్దరికి కమ్మ సామాజిక వర్గం నుంచి వైఎస్ మంత్రి పదవులు ఇచ్చారన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకోవడంతో తాడేపల్లి వర్గాలు అప్రమత్తం అయ్యాయి. ఎలాంటి ఎండ్ వసంత చేసిన కీలక వ్యాఖ్యలకు ఉంటుందో చూడాలి.