ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, పోలీసు వర్గాల్లో కూడా సంచలనం రేపుతున్న అంశం మాజీ పులివెందుల సీఐ జె. శంకరయ్య (Ex-CI Shankaraiah) నుంచి వచ్చిన లీగల్ నోటీసులు. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder) సమయంలో తనపై అనవసర ఆరోపణలు చేశారని, వాటి వల్ల తన ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిందని ఆరోపిస్తూ సీఐ శంకరయ్య నేరుగా సీఎం చంద్రబాబుకే (CM Chandrababu) నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామం ఎన్నికల తర్వాత సాధారణంగా ప్రజలు నాయకులను ప్రశ్నించలేని వాతావరణంలో, ఒక పోలీస్ అధికారి సాహసోపేతంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి నోటీసులు పంపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన చేసిన డిమాండ్లు అసెంబ్లీలో బహిరంగ క్షమాపణతో పాటు రూ.1.45 కోట్ల పరిహారం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
Fight Breaks : గ్రౌండ్ లో శృతిమించుతున్న పాక్ ఆటగాళ్ల తీరు..
వివేకా హత్య కేసు 2019 మార్చిలో రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ సమయంలో పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్యపై, నిందితులు ఆధారాలను ధ్వంసం చేసిన సమయంలో తగిన విధంగా స్పందించలేదని, రక్తపు మరకలు కడిగేసే పనులు ఆయన సమక్షంలో జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. అనంతరం సీబీఐ దర్యాప్తులోనూ శంకరయ్య వాంగ్మూలం కీలకంగా మారింది. ఆయన కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అనుచరులు బెదిరించారని, కేసు నమోదు చేయవద్దని ఒత్తిడి చేశారని చెప్పినా, మేజిస్ట్రేట్ ఎదుట ఆ వాంగ్మూలం కొనసాగించలేకపోయారు. ఈ పరిస్థితుల్లో ఆయన పాత్రపై అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం శంకరయ్య వీఆర్‌లో ఉన్నా, ఈ నోటీసులు కేసు మళ్లీ రాజకీయ మజిలీకి వెళ్లేలా చేశాయి. సీబీఐ ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పుడు శంకరయ్య నోటీసులు బయటకు రావడంతో, ఈ కేసులో కొత్త కోణాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఐదున్నరేళ్ల తరువాత ఇలా నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ, వ్యక్తిగత కారణాలేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారం ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చేరడంతో, రాబోయే రోజుల్లో ఇది రాజకీయ వర్గాల్లో వేడి చర్చలకు దారితీయడం ఖాయం.
