EWS Issue : `కాపు` జాతి కోసం..నాడు ముద్ర‌గ‌డ నేడు హ‌రిరామ‌జోగ‌య్య.!

మాజీ ఎంపీ హ‌రిరామ‌జోగ‌య్య‌. కాపు జాతి కోసం బ‌య‌ట‌కు వ‌చ్చారు.

  • Written By:
  • Publish Date - December 27, 2022 / 04:30 PM IST

మాజీ ఎంపీ హ‌రిరామ‌జోగ‌య్య‌. ఆయ‌న్ను ఈ త‌రంలోని వాళ్లు చాలా మంది మ‌ర‌చిపోయారు. వ‌య‌స్సు మీద ప‌డిన ఆయ‌న హ‌ఠాత్తుగా కాపు జాతి కోసం బ‌య‌ట‌కు వ‌చ్చారు. కాపుల‌ను బీసీలుగా (EWS Issue) గుర్తించాల‌ని ఆయ‌న చేస్తోన్న డిమాండ్‌. ఒక వేళ ఆ విధంగా రిజ‌ర్వేష‌న్ల‌ను (EWS Issue) అమ‌లు చేయ‌క‌పోతే, ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష‌కు దిగుతాన‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. కాపు(Kapu) జాతి కోసం ఇదే డిమాండ్ తో పోరాడిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సైడ్ అయిన చాలా కాలం త‌రువాత హ‌రిరామ‌జోగ‌య్య తెర‌మీద‌కు వ‌చ్చారు. ఆనాడు ర‌త్నాచ‌ల్ ఎక్స్ ప్రెస్ ను త‌గుల‌బెట్టే వ‌ర‌కు ఉద్య‌మాన్ని తీసుకెళ్లిన ముద్ర‌గ‌డ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత దాదాపుగా మౌనం వ‌హించారు. అప్పుడ‌ప్పుడు లేఖ‌లు రాయ‌డం వ‌ర‌కు ప‌రిమితం అయ్యారు. దీంతో కాపు (Kapu)  జాతి కోసం మ‌రో నాయ‌కుడు హ‌రిరామ‌జోగ‌య్య ఎంట్రీ ఇచ్చారు. ఫ‌లితంగా ఏపీ రాజ‌కీయం మ‌ళ్లీ కాపు రిజ‌ర్వేష‌న్ వైపు మ‌ళ్లింది.

Also Read : Kapu Reservations: కాపు రిజర్వేషన్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. ఏపీ సర్కార్‌కు తీపి కబురు!

కాపుల‌ను బీసీలుగా గుర్తించాల‌ని చాలా కాలంగా ఆ కులం పెద్ద‌లు కొంద‌రు చేస్తోన్న‌ డిమాండ్. కానీ, సోమ‌వారం విశాఖ కేంద్రంగా జ‌రిగిన కాపునాడు స‌భ‌లో మాత్రం రిజ‌ర్వేష‌న్ల కంటే రాజ్యాధికారం ముఖ్య‌మ‌ని నినదించారు. ఆ దిశ‌గా కాపు నాయ‌కులు పార్టీల‌కు అతీతంగా ముందుకు రావాల‌ని కోరారు. అంతేకాదు, రాజ‌కీయ తెర‌మీద ఇద్ద‌ర్ని (రంగా, చిరంజీవి)లేకుండా చేసుకున్నామ‌ని మూడో వ్య‌క్తిగా ఇప్పుడు ప‌వ‌న్ ఉన్నాడ‌ని వెల్ల‌డించారు. ఈ ఛాన్స్ పోతే ఇక రాజ్యాధికారం కాపుల‌కు రాద‌ని కాపునాడు తీర్మానం చేసింది. ఆందుకే, కాపులతో పాటు బీసీలు, ఎస్సీలు అంద‌రూ జ‌న‌సేన‌కు మ‌ద్ధ‌తు ఇవ్వాల‌ని పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం.

కాపునాడు అట్ట‌ర్ ప్లాప్(EWS Issue)

వాస్త‌వంగా కాపునాడు అట్ట‌ర్ ప్లాప్ అయింద‌ని ఆ కులం పెద్ద‌ల్లోని టాక్‌. ఆ స‌భ‌కు వైసీపీ లీడ‌ర్లు వెళ్ల‌లేదు. అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశం మేర‌కు స‌భ‌కు దూరంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ త‌ర‌పున చెప్పుకోద‌గిన లీడ‌ర్లు ఆ వేదిక‌పై క‌నిపించ‌లేదు. జ‌న‌సేన‌కు సంబంధించిన సోష‌ల్ మీడియా లీడ‌ర్లు మాత్ర‌మే కీల‌క‌భూమిక‌ను పోషించారు. అంటే, ఆ స‌భ కేవలం జ‌న‌సేన కోసం ఏర్పాటు చేసుకున్న‌ట్టు క‌నిపించింది. పైగా రాబోవు రోజుల్లో ప‌వ‌న్ కు మ‌ద్ధ‌తు ఇవ్వాల‌ని పిలుపు నివ్వ‌డం మిగిలిన పార్టీల లీడ‌ర్ల‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేదు. ఎందుకంటే, జ‌న‌సేన‌కు మ‌ద్ధ‌తు ఇచ్చినంత మాత్రాన కాపు కులంలోని పేద‌రికం పోద‌ని మిగిలిన పార్టీల్లోని ఆ కులం నేత‌లు చెప్పే మాట‌. ఇదంతా కొంద‌రు వ్య‌క్తుల‌కు ల‌బ్ది చేకూర్చేలా పెట్టిన స‌భ‌గా కాపునాడును భావించారు. అందుకే, దూరంగా ఉన్నారు.

Also Read : Supreme Court: EWS రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు.!

కాపుల‌ను బీసీలుగా గుర్తించ‌డానికి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏ రాజ‌కీయ పార్టీ కూడా అంగీక‌రించ‌దు. ఒక్క జ‌న‌సేన మాత్రం కులం కోసం రిజ‌ర్వేష‌న్ల‌ను కోరుకుంటోంది. అదే స‌మ‌యంలో బీసీ ఓటు బ్యాంకును పెద్ద ఎత్తున కోల్పోవ‌ల‌సి వ‌స్తుంద‌ని రాజ‌కీయ పార్టీల అంచ‌నా. గ‌తంలోనూ కాపుల‌ను బీసీల్లో చేర్చే క్ర‌మంలో చంద్ర‌బాబు రాజ‌కీయంగా భారీగా న‌ష్ట‌పోయారు. అటు అగ్ర వ‌ర్ణ‌పేద‌ల‌ను ఇటు బీసీల మ‌ద్ధ‌తు కోల్పోవ‌డంతో 2019 ఎన్నిక‌ల్లో 23 మంది ఎమ్మెల్యేకు ప‌రిమితం అయ్యారు. మ‌ళ్లీ అదే త‌ప్పు చేయ‌డానికి టీడీపీ సిద్దంగా లేద‌ని సోమ‌వారం జ‌రిగిన కాపునాడు స‌భ‌కు హాజ‌రైన ఆ పార్టీ లీడ‌ర్ల స్థాయిని బ‌ట్టి అర్థం అవుతోంది.

హ‌రిరామ జోగ‌య్య నిరాహార‌దీక్ష‌

వ్యూహాత్మంగా కాపు రిజ‌ర్వేష‌న్లపై ఎంపీ జీవీఎల్ పార్ల‌మెంట్ వేదిక‌గా ఇటీవ‌ల‌ ప్ర‌శ్నించారు. అందుకు స్పందిస్తూ ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ల‌ను ఎవ‌రికి ఎంత వాటా ఇవ్వాలి? అనేది రాష్ట్రాల‌కు విశిష్టాధికారం ఉంద‌ని కేంద్రం సెల‌విచ్చింది. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌న్న‌ డిమాండ్ తెర‌మీద‌కు వ‌చ్చింది. అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఇచ్చిన 10శాతం రిజ‌ర్వేష‌న్ల‌లో 5శాతం ఇచ్చేలా అసెంబ్లీ తీర్మానం చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగింది. దాన్ని బేస్ చేసుకుని రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని హ‌రిరామ‌జోగ‌య్య చేస్తోన్న డిమాండ్‌. కానీ, బీసీ, అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌ను కాద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌డానికి సానుకూలంగా లేరు. ఇదే ఆయ‌న‌కు ఈసారి ఎన్నిక‌ల్లోనూ ప్ల‌స్ పాయింట్ గా మారే అవ‌కాశం ఉంది. అందుకే, ఆ ఇష్యూను ప్ర‌ధాన రాజ‌కీయ అస్త్రంగా మ‌ల‌చ‌డానికి వ్యూహాత్మ‌కంగా ఆనాడు ముద్ర‌గ‌డ మాదిరిగా ప్ర‌స్తుతం హ‌రిరామ జోగ‌య్య నిరాహార‌దీక్ష‌కు దిగుతున్నార‌ని అనుమానించే వాళ్లు లేక‌పోలేదు.

Also Read : Kapu Leaders in AP: ఏపీలో `కాపు` క‌ల‌క‌లం!