EVM Snag: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు ఏకకాలంలో పోలింగ్ ప్రారంభమైంది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో జగన్ మోహన్ రెడ్డి ఓటు వేశారు. చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 2,387 మంది అభ్యర్థుల్లో చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. అదే సమయంలో 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ డి.పురందేశ్వరి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్. షర్మిలారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి అగ్రగామి.
ఓటు వేసేందుకు ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ ప్రదేశానికి క్యూ కడుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇదిలా ఉండగా పలు పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు ఒక్కసారిగా మొరాయించాయి. మంగళగిరిలో కొన్నిచోట్ల ఈవీఎంలు పనిచేయడం ఆపేశాయి. దుగ్గిరాల మండలం చుక్కావారి పాలెం, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కారంపూడిలోనూ ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
కాగా ఓటింగ్ ప్రక్రియ శాంతియుతంగా సజావుగా సాగేందుకు 1.14 లక్షల మంది పోలీసులతో సహా 5.26 లక్షల మంది సిబ్బందిని మోహరించారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు, మరో మూడు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.
Also Read: TS : ఎన్నికల వేళ యువతకు మెగాస్టార్ సందేశం