దేశం మెచ్చిన నాయకత్వానికి చిరస్థాయి గౌరవం : సీఎం చంద్రబాబు

వాజ్‌పేయీ నాయకత్వం దేశ చరిత్రను మలుపుతిప్పిందని, రాజకీయాల్లో విభేదాల మధ్య కూడా సమన్వయాన్ని సాధించిన గొప్ప నాయకుడిగా ఆయన గుర్తుండిపోతారని చంద్రబాబు చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Eternal respect for the leadership admired by the country: CM Chandrababu

Eternal respect for the leadership admired by the country: CM Chandrababu

. దేశాభివృద్ధికి వాజ్‌పేయీ అవిశ్రాంత కృషి

. ఎన్టీఆర్‌తో అనుబంధం, యాంటీ కాంగ్రెస్‌ ప్రయాణం

. టెలికాం నుంచి అణుపరీక్షల వరకూ దూరదృష్టి

 

Vajpayee Jayanti : ఆర్థిక సంస్కరణల అనంతరం దేశాన్ని కొత్త దిశలో నడిపించడంలో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కీలక పాత్ర పోషించారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సుపరిపాలన, సమ్మేళన రాజకీయాలు, దీర్ఘకాలిక దృష్టి ఇవే వాజ్‌పేయీ నాయకత్వానికి గుర్తింపని ఆయన కొనియాడారు. వాజ్‌పేయీ జయంతి సందర్భంగా అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సుపరిపాలన సభలో ఆయన ప్రసంగిస్తూ, దేశ ప్రజల హృదయాల్లో వాజ్‌పేయీ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. వాజ్‌పేయీ నాయకత్వం దేశ చరిత్రను మలుపుతిప్పిందని, రాజకీయాల్లో విభేదాల మధ్య కూడా సమన్వయాన్ని సాధించిన గొప్ప నాయకుడిగా ఆయన గుర్తుండిపోతారని చంద్రబాబు చెప్పారు. దేశ ప్రయోజనాలే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకున్న అరుదైన నాయకుల్లో వాజ్‌పేయీ ఒకరని అభిప్రాయపడ్డారు.

తనకు ఎప్పుడూ ప్రేరణనిచ్చిన నేత ఎన్టీఆర్‌ అని చంద్రబాబు గుర్తుచేశారు. ఎన్టీఆర్‌, వాజ్‌పేయీ మధ్య గాఢమైన సాన్నిహిత్యం ఉండేదని, దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ దారిని ఆవిష్కరించడంలో వారి ఆలోచనలు సమాంతరంగా సాగాయని తెలిపారు. నేషనల్‌ ఫ్రంట్‌ ఆవిర్భావం ద్వారా యాంటీ కాంగ్రెస్‌ రాజకీయాలకు ఎన్టీఆర్‌ పునాది వేశారని, ఆ బాటలో వాజ్‌పేయీ నేతృత్వం దేశ రాజకీయాలకు కొత్త ఊపునిచ్చిందని చెప్పారు. దేశం కోసం ఆలోచించే నాయకత్వమే చరిత్రను నిర్మిస్తుందని చంద్రబాబు అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌, వాజ్‌పేయీ దేశ ప్రయోజనాలను ముందుంచి నిర్ణయాలు తీసుకున్నారని, అదే సంప్రదాయం నేటి నాయకత్వంలోనూ కనిపిస్తోందని పేర్కొన్నారు. తాను టెలిఫోన్‌, టెలికాం రంగాల ప్రాధాన్యాన్ని ప్రస్తావించిన రోజుల్లో విమర్శలు ఎదుర్కొన్నానని చంద్రబాబు గుర్తు చేశారు.

నాలెడ్జ్‌ ఎకానమీకి టెలికాం రంగం వెన్నెముకలాంటిదని, ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందడంలో వాజ్‌పేయీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కీలకమని అన్నారు. టెలికాం సంస్కరణలతో దేశంలో సాంకేతిక విప్లవానికి బాటలు పడ్డాయని తెలిపారు. అదే విధంగా వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న కాలంలో నిర్వహించిన అణుపరీక్షలు దేశ భద్రత, స్వావలంబనకు ప్రతీకగా నిలిచాయని చెప్పారు. ప్రపంచ వేదికపై భారత్‌ స్థాయిని పెంచిన ఆ నిర్ణయాలు దేశానికి గర్వకారణమని అన్నారు. నేడు ప్రధాని నరేంద్రమోదీ కూడా దేశం కోసం అదే దూరదృష్టితో పనిచేస్తున్నారని, తాను మాత్రం తెలుగుజాతి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. సుపరిపాలన, సాంకేతిక అభివృద్ధి, జాతీయ భద్రత—ఈ మూడు స్థంభాలపై వాజ్‌పేయీ చూపిన మార్గమే దేశానికి శాశ్వత దిశానిర్దేశమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  Last Updated: 25 Dec 2025, 03:38 PM IST