Liquor Scam : `ఢిల్లీ లిక్క‌ర్` కిక్- ఏపీ,తెలంగాణాల్లో మ‌ళ్లీ ఈడీ దాడులు!

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజ‌కీయాన్ని వేడెక్కించింది. ఇటీవ‌ల ఎమ్మెల్సీ క‌విత‌కు స‌న్నిహితులుగా ఉండే వాళ్లు కంపెనీలు, ఇళ్ల‌లో ఈడీ సోదాలు నిర్వ‌హించింది.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 01:06 PM IST

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజ‌కీయాన్ని వేడెక్కించింది. ఇటీవ‌ల ఎమ్మెల్సీ క‌విత‌కు స‌న్నిహితులుగా ఉండే వాళ్లు కంపెనీలు, ఇళ్ల‌లో ఈడీ సోదాలు నిర్వ‌హించింది. తాజాగా మ‌ళ్లీ శుక్ర‌వారం తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌లు చోట్ల ఈడీ దాడులు చేస్తోంది. ప్ర‌త్యేకించి నెల్లూరు కేంద్రంగా సోదాలు నిర్వ‌హించ‌డం టీడీపీ వ‌ర్గాలు చేసి ఆరోప‌ణ‌లు నిజం కాబోతున్నాయా? అనే కోణం నుంచి చ‌ర్చ జ‌రుగుతోంది.

గ‌త రెండు వారాలుగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి భార‌తి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి క‌లిసి ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారాన్ని న‌డిపార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాల‌ను కూడా మీడియాకు చెప్ప‌డం తెలిసిందే. ఇప్పుడు అక‌స్మాత్తుగా నెల్లూరు కేంద్రంగా ఈడీ దాడులు నిర్వ‌హించ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కు సంబంధించిన ఆధారాలు ఉన్నాయ‌ని బీజేపీ ఎంపీలు చెబుతున్నారు. అందుకు సంబంధించిన స్ట్రింగ్ ఆప‌రేష‌న్ తొలి వీడియోను గ‌త వారం విడుద‌ల చేశారు. తాజాగా మ‌రో వీడియోను విడుద‌ల చేయ‌డం స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

బిజెపి మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో హైదరాబాద్ లింకులపై గతంలోనే సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పాత్ర ఇందులో ఉందని ఆయన ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. బిజెపి ఎంపి డాక్టర్ సుధాన్షు త్రివేది, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా మరియు మంజీందర్ సింగ్ సిర్సా మద్యం విక్రయాల కాంట్రాక్టులకు సంబంధించి జ‌రిగిన అక్ర‌మాల‌ వీడియోలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీని మార్చడం ద్వారా కోట్లాది రూపాయలను దోచుకున్నార‌ని ఎంపీ డాక్టర్ హర్షవర్ధన్, ఇతర బీజేపీ ఎంపీలు రమేష్ బిధూరి, ప్రవేశ్ సాహిబ్ సింగ్, హన్సరాజ్ హన్స్ ఆరోపిస్తున్నారు.

ఢిల్లీ ప్రభుత్వం చిన్న వ్యాపారులను ఎక్సైజ్ పాలసీ నుండి దూరంగా ఉంచింది. ఇక్క‌డే స్కామ్ కు బీజం ప‌డిందని బీజేపీ లీడ‌ర్లు చెబుతున్నారు. లిక్కర్ కుంభకోణంలో హైదరాబాద్ నుంచి ఎవరెవరు ఢిల్లీకి వచ్చారు? ఎవరెవరిని కలిశారు? ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వెళ్లి ఎవరెవరు ఎప్పుడు ఎవరెవరిని కలిశారు? త‌దిత‌ర ఆధారాలు ఉన్నాయని బీజేపీ ఢిల్లీ విభాగం చెబుతోంది. ఈ ఆధారాలను కోర్టుకు అందించ‌డానికి సిద్ధం అవుతోంది. దీంతో ఎవ‌రి పేరు ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందోన‌ని తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ లీడ‌ర్ల‌లో ఉత్కంఠ నెల‌కొంది.

శుక్ర‌వారం ఐదు రాష్ట్రాల్లోని 40 లొకేషన్లలో ఒకేసారి సోదాలను నిర్వహిస్తోంది. హైదరాబాదులోనే 20 చోట్ల సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలోని నెల్లూరుతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీలో కూడా సోదాలు జరుగుతున్నాయి. లిక్కర్ బిజినెస్ వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్ వర్క్ లే లక్ష్యంగా దాడులు. కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈడీ దాడులు మూడు వారాల వ్య‌వ‌ధిలో రెండోసారి కూడా జ‌ర‌గ‌డం కావడం గమనార్హం. గత వారం ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో సోదాలను నిర్వహించింది. అప్పుడు ఏపీలో సోదాలకు దూరంగా ఉన్న‌ ఈడీ ఈసారి నెల్లూరులో సోదాలు నిర్వహిస్తుండటం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది.

గోవా, పంజాబ్‌లో ఎన్నికల కోసం 100 కోట్ల రూపాయలను మద్యం దిగ్గజాలు ఆప్‌కి నగదు రూపంలో ఇచ్చారని బిజెపి ప్రసారం చేసిన స్టింగ్ వీడియో పేర్కొంది. గ‌తంలో రూ. 10 లక్షలకు ఇచ్చిన లైసెన్స్ ఏకంగా రూ. 5 కోట్ల వరకు పెంచడం వెనుక పెద్ద క‌థ న‌డిచింది. బీజేపీ` స్టింగ్ టేప్‌`లో ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో నిందితులలో ఒకరైన అమిత్ అరోరా ఉన్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం లైసెన్స్‌ల కోసం భారీ కమీషన్ తీసుకుంద‌ని ఆరోప‌ణ‌. ఆ డబ్బును పంజాబ్ , గోవా ఎన్నికలకు ఉపయోగించిందని అమిత్ అరోరా పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ఢిల్లీ టూ హైద‌రాబాద్ వ‌యా నెల్లూరు చుట్టూ లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారం న‌డుస్తోంది. దీంతో విప‌క్ష పార్టీలు మ‌రోసారి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి భార‌తి, విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌మేయాన్ని అనుమాస్తున్నాయి. స్కామ్ కు సంబంధించిన న్యూస్ లో పేరు రాకుండా క‌విత కోర్టుల నుంచి ఉత్త‌ర్వులు తీసుకొచ్చారు. అదే బాట‌న భార‌తి, విజ‌య‌సాయిరెడ్డి కూడా న‌డుస్తామ‌ని టీడీపీ చేస్తోన్న ఆరోప‌ణ‌. నెల్లూరులో ఈడీ చేస్తోన్న దాడుల‌తో మొత్తం వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రానుంద‌ని టీడీపీ ఎదురుచూస్తోంది. కానీ, తొలి విడ‌త ఏపీని వ‌దిలేసిన ఈడీ రెండోసారి దాడుల్లో ఎంట్రీ ఇవ్వ‌డం కొన్ని అనుమానాల‌ను క‌లిగిస్తోంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ పెద్ద దుమారాన్నే రేపుతోంది.