NRI Hospital : ఎన్నారై ఆస్ప‌త్రికి రాజ‌కీయ గ్ర‌హణం! రంగంలోకి ఈడీ!

  • Written By:
  • Publish Date - December 2, 2022 / 05:09 PM IST

ఏపీలో ఈడీ సోదాల‌ను మొద‌లు పెట్టింది. ఎన్నారై కాలేజి భాగోతాల‌ను బ‌య‌ట‌కు తీస్తోంది. ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఎన్నారై ఆస్ప‌త్రి యాజ‌మాన్యం మారింది. అందుకు కార‌ణం వైసీపీ ప‌రోక్ష ప్ర‌మేయం ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. యాజ‌మాన్యం మార్పు స‌మ‌యంలో ఆస్ప‌త్రి కేంద్రంగా గంద‌ర‌గోళం రేగింది. ఫైళ్ల‌ను తారుమారు చేయ‌డమే కాకుండా కొన్నింటిని గ‌ల్లంతు చేసిన వైనం కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఆ క్ర‌మంలో జ‌గ‌న్ స‌ర్కార్ లోని కొంద‌రు పెద్ద‌ల స‌హ‌కారంతో ఎన్నారై ఆస్ప‌త్రి కేంద్రంగా కొంత కాలం గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాల్లోని టాక్‌.

ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లోని ఎన్నారై ఆస్ప‌త్రి అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ సీఎండీ మణిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ అధికారులు మణిని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. విదేశీ పెట్టుబడులు, నిధుల మళ్లింపుపై ఈడీ ఆరా తీస్తోంది. ఎన్నారై, మేనేజ్ మెంట్ కోటాల్లో మెడికల్ సీట్లకు కోట్ల నిధులు వసూలు చేసినట్టు మణిపై ఈడీకి చేరింద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈడీ సోదాలు కొన‌సాగుతున్నాయ‌ని స‌మాచారం.

ఇప్పటికే ఈడీ అధికారులు ఆసుపత్రి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రిలోకి ఎవరినీ రానివ్వకుండా ఈడీ అధికారులు సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. విజయవాడలో అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ గత ఆగస్టులోనే ప్రారంభమైంది. ఎన్నారై ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్ గా కూడా మ‌ణి అక్కినేని ఉన్నారు. కొన్ని ప‌రిక‌రాలు ఎన్నారై నిధుల‌తో కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆ నిధుల విదేశాల నుంచి మళ్లించిన‌ట్టు తెలుస్తోంది. ఎన్నారై కమిటీ మరో సభ్యుడు నిమ్మగడ్డ ఉపేంద్ర ఇంటిపైనా కూడా దాడులు జ‌రుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వ‌చ్చిన ప్ర‌త్యేక ఈడీ టీమ్ లు ఎన్నారై ఆస్ప‌త్రి లావాదేవీల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్నాయి. అంతిమంగా ఈడీ ఈ కేసును ఎటు వైపు తీసుకెళుతుందో చూడాలి.