AP Cabinet : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గురువారం ఉదయం 11 గంటలకు సమావేశమైన కేబినెట్ భేటి ముగిసింది. ఈ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో రూ. 24,276 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాజధాని నిర్మాణానికి హడ్కో (Hudco) ద్వారా రూ. 11 వేల కోట్లు రుణానికి, కేఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా రూ. 5 వేల కోట్ల రుణానికి ఆమోదం వ్యక్తం చేసింది. మంగళగిరి ఎయిమ్స్‌కు అదనంగా మరో 10 ఎకరాల భూమి కేటాయించడానికి నిర్ణయం తీసుకుంది.
ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలకు ఉచితంగా ఇచ్చే అంశం,ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిధుల విడుదలపై చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ పనులకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రతిపాదనకు, హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్‌కు అనుమతి నిస్తూ నిర్ణయం తీసుకుంది. వర్షకాలంలో భారీ వర్షాలకు నష్టపోయిన 10 జిల్లాలోని వరద ప్రభావిత బాధితులకు రుణాల రీ షెడ్యూల్‌పై, రైతులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయించే ప్రతిపాదనపై చర్చ కొనసాగింది. ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం వ్యక్తం చేసిన కేబినెట్ వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం తెలిపింది.