AP PRC : ఉద్యోగుల అల్టిమేటం! జ‌గ‌న్ మార్క్ `సంక్రాంతి` సినిమా!

రాష్ట్ర బ‌డ్జెట్ లో 70శాతం వాటా ఉద్యోగుల(Employees)జీత‌భ‌త్యాల‌కు పోతోంది.

  • Written By:
  • Updated On - December 14, 2022 / 03:36 PM IST

రాష్ట్ర బ‌డ్జెట్ లో 70శాతం వాటా ఉద్యోగుల(Employees)జీత‌భ‌త్యాల‌కు, (PRC) పీఆర్ సీల‌కు పోతోంది. జనాభాలో వాళ్ల నిష్ప‌త్తి 5శాతానికి మించ‌దు. వాళ్ల కుటుంబ స‌భ్యుల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ప్ప‌టికీ 10శాతానికి మించి జ‌నాభాలో ఉండ‌రు. కానీ, ప్ర‌జా ధ‌నం వాళ్ల జీత‌,భ‌త్యాల‌కు, (PRC) పీఆర్ సీల‌కు  70శాతానికి పైగా పోతోంది. అయిన‌ప్ప‌టికీ అవినీతి, అక్ర‌మాలు త‌గ్గుతున్నాయా? అంటే లేద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ప్ర‌జ‌లు కూడా ఉద్యోగుల(Employees) అవినీతి మీద విసిగిపోయారు. స‌రిగ్గా ఈ పాయింట్ ను ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీరియ‌స్ గా గ‌మ‌నించారు. ఉద్యోగుల వ్య‌తిరేక ఎజెండాతో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే సాహ‌సోపేత నిర్ణ‌యం దిశ‌గా ఆలోచిస్తున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌.

సీపీఎస్(CPS) ర‌ద్దు హామీని 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో సాధ్యంకాద‌ని జీపీఎస్ ను ప్ర‌త్యామ్నాయ మార్గంగా చూపారు. కానీ, ఉద్యోగులు(Employees) రోడ్ల మీద‌కు వ‌చ్చి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న మీద తిర‌గ‌బ‌డ్డారు. గ‌తంలోని సీఎంల మాదిరిగా డిమాండ్ల‌కు లొంగిపోతార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని త‌క్కువ అంచ‌నా వేశారు. ఇక‌ ఆ రోజు నుంచి ఉద్యోగుల‌కు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. సీపీఎస్(CPS) ర‌ద్దు కుద‌ర‌ద‌ని మంత్రివ‌ర్గం ఉప సంఘం తేల్చి చెప్పింది. పీఆర్(PRC) వేయ‌డం కూడా సాధ్యంకాద‌ని సంకేతాలు ఇచ్చింది. అంతేకాదు, మ‌హా అయితే కోర్టుల‌కు వెళ‌తారు? అంతేక‌దా అంటూ మంత్రి బొత్సా ఉద్యోగులు అత్యాశ‌పై చుర‌క‌లు వేశారు. ప్ర‌భుత్వం కోర్కెలు తీర్చే కొద్దీ కొత్త‌గా మ‌ళ్లీ పుట్టుకొస్తాయ‌ని ఉద్యోగుల వాల‌కంపై వ్యంగ్య‌స్త్రాల‌ను సంధించారు. అయిన‌ప్ప‌టికీ కిక్కురుమ‌న‌కుండా ఉద్యోగులు ఉన్నారు.

జీతాలు, బ‌కాయిలు పీఆర్‌సీ ఇవ్వండి

డిమాండ్ల సంగ‌తి దేవుడెరుగు ముందు జీతాలు, బ‌కాయిలు ఇవ్వండి మొర్రో అంటూ ఉద్యోగులు వేడుకుంటున్నారు. లేదంటే, సంక్రాంతి తర్వాత ఉద్యమిస్తామని, సమ్మెలకు వెనుకాడబోమని ఉద్యోగ సంఘాల నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. వచ్చే జనవరి 15ని డెడ్‌లైన్‌గా పెడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతలు ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.సుమారు నెలన్నర గడుస్తున్నా జీతాలు విడుదల చేయకపోవడంపై ఉద్యోగ సంఘాల నేతలతో కూడిన ఏపీజేఏసీ సమావేశమై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలో కర్నూలులో మూడోసారి ఏపీ జేఏసీ అమరావతి మహా సభ నిర్వహిస్తామ‌ని వెల్ల‌డించారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సిన వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రతినెలా జీతాలు విడుదల కావడం లేదని అన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చెల్లింపులో జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన రోజున సూపర్‌యాన్యుయేషన్‌ బెనిఫిట్‌లను విడుదల చేయాలని అన్నారు. ఉద్యోగి మరణిస్తే, అంత్యక్రియల ఖర్చులు చెల్లించ‌డంలేద‌ని, సీపీఎస్ రద్దు, పోస్టుల క్రమబద్ధీకరణ, జీతాలు, భత్యాల చెల్లింపుపై ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా అమలు కావ‌డంలేద‌ని బొప్ప‌రాజు ధ్వ‌జమెత్తారు.

సీపీఎస్‌పై పలుమార్లు సమావేశాలు నిర్వహిస్తున్నా ఫలితం లేదు. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు CPSని రద్దు చేశాయి, ఇటీవల హిమాచల్ ప్రదేశ్ కూడా అలా చేసింది. 11వ పీఆర్‌సీ (PRC)విషయంలో ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉంది. అవకతవకల వల్ల ఉద్యోగులు నష్టపోయారని, 12వ పీఆర్‌సీ(PRC) కమిషన్‌ ద్వారా నివేదిక తీసుకురావాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. ‘‘జిల్లా కలెక్టర్ ఒత్తిడి వల్లే ఓ తహశీల్దార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలను ప్రభుత్వం క్రమబద్ధీకరించాలి’’ అని నేతలు తాజా డిమాండ్ల‌ను ఫ్రేమ్ చేశారు. ఒక వేళ డిమాండ్ల‌ను నెర‌వేర్చ‌క‌పోతే సంక్రాంతి త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చుక్క‌లు చూపించ‌డానికి ఉద్యోగులు సిద్దం అవుతున్నార‌ట‌. అందుకే, సీఎం ముందుగా ఎన్నిక‌ల విధుల నుంచి ఉపాధ్యాయుల‌ను త‌ప్పిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక స‌చివాల‌య ఉద్యోగులు రెండు, మూడు వ‌ర్గాలుగా ఉన్నారు. వాళ్ల మ‌ధ్య సంఖ్య‌త లేద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బాగా తెలుసు.

సీపీఎస్  లేద‌ని..

పేద‌ల‌కు డ‌బ్బు ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం స‌మ‌కూర్చుకోలేక‌పోతోంది. ఓవ‌ర్ డ్రాఫ్ట్ కు వెళ్ల‌డానికి లేద‌ని ఆర్బీఐ తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల‌కు పీఆర్సీ(PRC), సీపీఎస్ (CPS)ర‌ద్దు త‌దిత‌ర డిమాండ్లు పెట్ట‌డం ఏమిటి? అని ప్ర‌శ్నించే పౌరుల‌ను సిద్దం చేస్తున్నారు. అమ‌రావ‌తి, ఉద్యోగుల వ్య‌తిరేక ఎజెండాతో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రంగం సిద్ధం చేస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. `ప్ర‌భుత్వాల‌ను కూల్చుతాం..ఏర్పాటు చేస్తాం…` అంటూ ఇటీవ‌ల ఉద్యోగ సంఘాల నేత‌లు హెచ్చ‌రిక‌లు చేసిన విష‌యం విదిత‌మే. ఆ త‌ర‌హా బెదిరింపులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌యాంలో చెల్ల‌వ‌ని ఇప్ప‌టికే ఉద్యోగుల‌కు అర్థమైయింది. గ‌తంలో వైఎస్, చంద్ర‌బాబు, రోశ‌య్య త‌దిత‌ర సీఎంల‌ను ఇలాగే బెదిరిస్తూ ఉద్యోగులు ఎప్ప‌టిక‌ప్పుడు జీతాల‌ను అమాంతం పెంచేసుకున్నారు. సీన్ క‌ట్ చేస్తే, ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అప్పుల్లోకి వెళ్లాయి. ప్ర‌త్యేకించి ఏపీ అప్పులు కొండ‌లా పెరిగిపోతోంది. ఇలాంటి త‌రుణంలోనూ ఉద్యోగులు(Employees) జీతాలు పెంచ‌మ‌ని డిమాండ్ చేస్తూ ప‌ని ఒత్తిడి త‌గ్గించాల‌ని కోర‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చిర్రెత్తిస్తుంద‌ట‌. సంక్రాంతి త‌రువాత ఉద్యోగుల భ‌ర‌తం ప‌ట్ట‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మార్క్ ప్లాన్ సిద్ధమైంద‌ని వినికిడి. అంటే, ఉద్యోగుల ఆట‌లు ఇక సాగ‌వ‌న్న‌మాట‌.

Also Read : Traffic Police : చంద్ర‌బాబు భ‌ద్ర‌త ఎంత‌? సెక్యూరిటీ ఆడిట్‌!