Stampede : వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు పరిహారంపై తీర్మానం చేయనున్నారు. ఈరోజు సాయంత్రానికి పరిహారం చెక్కులు తయారుచేసే అంశంపై చర్చ జరగనుంది. ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం శనివారం ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి చెక్కులు అందజేసే అంశంపై చర్చించనున్నారు. ఈ మేరకు అత్యవసర సమావేశం నిర్వహించాలని అధికారులను టీటీడీ బోర్డు ఆదేశించింది.
కాగా, తిరుపతిలోని పద్మావతి గార్డెన్‌లో గత బుధవారం రాత్రి నెలకొల్పిన టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృత్యువాత పడగా 48 మంది గాయపడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ గురువారం తిరుపతి ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శించారు.
ఈ ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి లక్ష చొప్పున ప్రభుత్వం పరిహారంగా ప్రకటించింది. అంతేకాక..అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎస్పీ పాటు గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, సీవీఎస్‌వో శ్రీధర్‌ను అక్కడి నుంచి బదిలీ చేశారు.
Read Also: Lay Out : లే ఔట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం