Site icon HashtagU Telugu

Andhra Pradesh : సమ్మె నోటీసును ఉపసంహరించుకున్న విద్యుత్ ఉద్యోగులు

power

power

ఏపీలో విద్యుత్ ఉద్యోగులు స‌మ్మె నోటీసును ఉప‌సంహ‌రించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం ఏపీ సచివాలయంలో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. జవహర్‌రెడ్డి తదితర అధికారులతో జరిపిన చర్చల స‌ఫ‌ల‌మైయ్యాయి. ప్రతిపాదిత నిరవధిక సమ్మెను జేఏసీ విరమించుకుంది. ఈరోజు (గురువారం) నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని జేఏసీ నేతలు నిర్ణయించారు.బుధవారం మంత్రి రామచంద్రారెడ్డి తమ డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించారు. దీంతో సమ్మె నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన వేతన సవరణకు ప్రభుత్వం అంగీకరించింది. వేతన నిర్ణయానికి సంబంధించి విద్యుత్తు వినియోగ శాఖల ఉన్నతాధికారులతో కమిటీ వేయడానికి కూడా సమావేశంలో అంగీకరించారు. ఈ సమావేశంలో ఏపీఎస్‌పీజేఏసీ చైర్మన్‌ పి చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి పి ప్రతాప్‌రెడ్డి, కన్వీనర్‌ బి సాయికృష్ణ, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం అధికారులు, జేఏసీ నేతలు ఒప్పందంపై సంతకాలు చేశారు. పెండింగ్‌లో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. దళారులు, ఏజెన్సీల ప్రమేయం లేకుండా కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని.. నేరుగా వేతనాలు చెల్లించాలని జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. జేఏసీ నేతలు 12 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఉద్యోగుల కొన్ని ప్రధాన డిమాండ్లను అంగీకరించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె నోటీసును ఉపసంహరించుకుని యథావిధిగా విధులకు హాజరుకానున్నట్లు జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పీ ప్రతాప్ రెడ్డి, కన్వీనర్ బీ సాయికృష్ణ మీడియాకు తెలిపారు.