AP News: ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్, 8080 మందికి ఉపాధి

జర్మనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ అతిపెద్ద తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది.

  • Written By:
  • Updated On - November 18, 2023 / 04:14 PM IST

AP News: జర్మనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ బస్సులు మరియు ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని పెప్పర్ మోషన్ జీఎంబీహెచ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ భారీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లా పుంగనూరులో 800 ఎకరాలు కేటాయించి అనేక రాయితీలు ఇచ్చింది.

దాదాపు రూ.4,640 కోట్ల (600 మిలియన్ అమెరికన్ డాలర్లు) పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా 8080 మందికి ఉపాధి లభించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో టెస్లా మోడల్‌లో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్కుల తయారీ యూనిట్‌తో పాటు, డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి రెట్రో-ఫిట్టింగ్, 20 GWH సామర్థ్యం కలిగిన బ్యాటరీ తయారీ యూనిట్, విడిభాగాల తయారీ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహం, ఆయన తీసుకుంటున్న ప్రగతిశీల ఆర్థిక విధానాలు, పోర్టులు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంతో ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు ఎంపికైనట్లు మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ ఆండ్రియాస్‌ హేగర్‌ తెలిపారు. త్వరితగతిన అనుమతులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.