Site icon HashtagU Telugu

AP Education:ఏపీలో మళ్లీ విద్యా రాజకీయం!

Students

Students

ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరుచుకున్నాయి. రాజకీయం మొదలైంది. కరోనా మొదలైనప్పటి నుంచి స్కూళ్లు, పరీక్షలపై రాజకీయం జరుగుతూనే ఉంది. ఒక దశలో వ్యవహారం హైకోర్టుకు వరకు వెళ్లింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే కనిపిస్తోంది.

తెలంగాణ కన్నా ఏపీలో ఒమిక్రాన్‌ వేరియంట్‌, కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. మళ్లీ కేసులు రోజూ 5 వేల వరకు నమోదవుతున్నాయి. తెలంగాణలో రెండున్నర వేల కేసులే వస్తున్నా అక్కడ మాత్రం మెడికల్‌ కాలేజీలు మినహా అన్నివిద్యా సంస్థలకు ఈ నెలాఖరుకు వరకు సెలవులు ప్రకటించారు. ఏపీలో మాత్రం యధావిధిగా స్కూళ్లు ఉంటాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్‌కు లేఖలు రాశారు. స్కూళ్లకు సెలవులను పొడిగించాలని కోరారు. రోజూ 5 వేల కేసులు వస్తున్నందున స్కూళ్లలో వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, 15 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌ లేదు కాబట్టి ఆన్‌లైన్‌ క్లాస్‌లను మాత్రమే పెట్టాలని డిమాండ్‌ చేశారు.

పిల్లలు, వారి తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు, స్కూళ్లు తెరవడం అంటే పెను ప్రమాదమే అని లోకేష్‌ హెచ్చరించారు. కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ల్లోనూ ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య ఇదే తరహా రాజకీయం నడిచింది. గత డాది అయితే పరీక్షలు పెట్టొద్దని హైకోర్టులో కేసులు కూడా వేశారు. నారా లోకేష్‌ పెద్దయెత్తున క్యాంపెయిన్‌ నిర్వహించారు.
మరి ఈసారి ఈ రాజకీయం ఎంత వరకు వెళుతుందో చూడాలి.

Exit mobile version