Election Commission : జ‌న‌సేన‌, ప్ర‌జాశాంతిపార్టీ, టీజేఎస్ కు `ఈసీ` జ‌ల‌క్‌

రాజకీయ పార్టీల‌ను నిర్వ‌హించ‌డానికి ఒక నిర్థిష్ట‌మైన రాజ్యాంగం ఉంటుంది. ఆ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా పార్టీల‌ను న‌డ‌పాలి.

  • Written By:
  • Publish Date - May 26, 2022 / 12:28 PM IST

రాజకీయ పార్టీల‌ను నిర్వ‌హించ‌డానికి ఒక నిర్థిష్ట‌మైన రాజ్యాంగం ఉంటుంది. ఆ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా పార్టీల‌ను న‌డ‌పాలి. త‌ద్విరుద్ధంగా కార్య‌క‌లాపాలు ఉన్న‌ట్టు గుర్తిస్తే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆయా పార్టీల‌పై చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఇప్పుడు జ‌న‌సేన‌, తెలంగాణ జ‌న‌స‌మితి, ప్ర‌జాశాంతి పార్టీల విష‌యంలోనూ ఈసీ సీరియ‌స్ అయింది. మార్గ‌ద‌ర్శ‌కాల‌కు విరుద్ధంగా అవ‌క‌త‌వ‌క‌లు ఉన్న‌ట్టు గుర్తించింది.

ఎన్నికల సంఘం గుర్తింపు పొందని రాజకీయ పార్టీలపై కొరడా ఝళిపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సిద్ధమైంది. ఆ పార్టీలన్నీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించిన ఈసీ చర్యలు తప్పవని హెచ్చరించింది. సాధారణంగా రాజకీయ పార్టీలన్నీ సేకరించిన విరాళాల నివేదికను ఈసీకి అంద‌చేయాలి. అలాగే పేర్ల మార్పిడి, ప్రధాన కార్యాలయం, ఆఫీస్ బేరర్లు, చిరునామాల వివరాలను ఈసీకి అందించాలి. గుర్తింపు పొందని పార్టీలన్నీ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. దేశంలో ఇలాంటి పార్టీలు 2,100కు పైగా ఉన్నట్టు తెలిపింది. వీటన్నింటిపై కచ్చితంగా చర్యలు ఉంటాయన్న ఈసీ వెల్ల‌డించింది. అయితే, ఎలాంటి చర్యలు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈసీ పేర్కొన్న పార్టీలో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన, ప్రొఫెసర్ కోదండరాంకు చెందిన తెలంగాణ జన సమితి, కేఏ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీలు కూడా ఉన్నాయి.

జ‌న‌సేన‌, ప్ర‌జాశాంతి పార్టీ, తెలంగాణ జ‌న స‌మితి పార్టీలకు ఈసీ గుర్తింపు లేదు. కేవ‌లం ఆ పార్టీ రిజిస్ట‌ర్డ్ పార్టీలు మాత్ర‌మే. క‌నీసం ఓటు బ్యాంకు వస్తేనే ఆ పార్టీల‌కు గుర్తింపు వ‌స్తుంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌, ఏపీల్లో ఉన్న ఆ పార్టీలకు క‌నీస ఓటు బ్యాంకును సంపాదించుకోలేదు. రెండు ఎన్నిక‌ల్లో పోటీ చేసిన‌ప్ప‌టికీ ఆ పార్టీల‌కు నిబంధ‌న ప్ర‌కారం గుర్తింపు వ‌చ్చేంత ఓటు బ్యాంకు రాలేదు. రిజిస్ట‌ర్ అయిన పార్టీల జాబితాలో ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల సంఘం నియ‌మావ‌ళిని పాటించాలి. ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌ల‌ను ఈసీకి అంద‌చేయాలి. ఆ మూడు పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్టు ఈసీ గుర్తించింది. ఎలాంటి చ‌ర్య‌లు ఆ పార్టీల‌పై ఈసీ తీసుకుంటుందో చూడాలి.