Site icon HashtagU Telugu

EC to YSRCP: వైసీపీ శాశ్వ‌త అధ్యక్షుడిగా జ‌గ‌న్ ఎన్నిక చెల్ల‌దు!

ఇటీవల వైసీపీ తీసుకుంటున్న విపరీత నిర్ణయాల్లో జగన్‌ను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం ఒకటి. ప్లీనరీలో ఈ పనిచేసినప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఈ పోకడేంటని ప్రశ్నించారు. కానీ జగన్ లెక్క చేయలేదు. ఇప్పుడు ఈసీ దగ్గర జగన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న పోకడపై ఈసీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.

వైసీపీకి జగన్‌ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం చెల్లుబాటు కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి శాశ్వత అధ్యక్షుడుగానీ, శాశ్వత పదవులు గానీ వర్తించవని స్పష్టం చేసింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి ఈసీ ఘాటు లేఖ రాసింది.

ఏ రాజకీయ పార్టీకైనా తరుచూ ఎన్నికలు జరగాలి.. శాశ్వత అధ్యక్షులుగా ప్రకటించుకోవడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.. ఈ ఎన్నికపై అనేక మార్లు వైసీపీ కార్యాలయానికి లేఖ రాసినా స్పందన లేదని ఈసీ వివరించింది. కాబట్టి వెంటనే ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజయసాయిరెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం ఈసీ నిబంధనలకు విరుద్దమని కూడా స్పష్టం చేసింది. ఈ అంశంపై పలుమార్లు సమాచారం కోరినా వైసీపీ స్పందించలేదని.. దాంతో శాశ్వత అధ్యక్షుడి ప్రకటన నిజమేనని భావించాల్సి వచ్చిందని ఈసీ వివరించింది. ఇలాంటి నిర్ణయాలు చెల్లుబాటు కావని.. ఈ దేశంలో ఈసీ జారీ చేసిన నియమావళిని అంగీరించిన తర్వాతనే పార్టీల రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ నడుస్తాయన్నది గుర్తించుకోవాలని సూచించింది. కాబట్టి ఏం జరిగిందన్న దానిపై తమకు నివేదిక పంపాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది.

Exit mobile version