Andhra Pradesh Earthquake ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదయింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.
భూప్రకంపనల కారణంగా దర్శి, వినుకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
దీనిపై నిపుణులు స్పందిస్తూ… రాబోయే రోజుల్లో కూడా మరిన్ని భూకంపాలు రావచ్చని తెలిపారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో తరచుగా భూమి కంపిస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని నెలల క్రితం తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో భూమి కంపించిన సంగతి తెలిసిందే.
